కాంగ్రెస్ తో జగన్ ను కలపడానికి సిద్ధం: కేవీపీ

 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మధ్య బంధం గురించి అందరికి తెలిసిందే. కేవీపీని వైఎస్ ఆత్మ అని కూడా అనేవారు. వైఎస్ మరణాంతరం వైఎస్ తనయుడు జగన్.. కాంగ్రెస్ కి దూరమై సొంతంగా పార్టీని స్థాపించారు. అయితే కేవీపీ కాంగ్రెస్ ని వీడి జగన్ వెంట వెళ్ళలేదు.. కానీ వైఎస్ కుటుంబాన్ని అభిమానిస్తూనే ఉన్నారు. అంతెందుకు ఇన్నేళ్లల్లో కేవీపీ జగన్ మీద ఒక్క విమర్శ కూడా చేయలేదు.

తాజాగా కేవీపీ ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ తో తనకున్న బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ తో తనకున్న సంబంధం మామ-అల్లుళ్ల మధ్య ఉన్న సంబంధమని అన్నారు. అయితే అది వ్యక్తిగతమని.. రాజకీయాలకు, తమ అనుబంధానికి సంబంధం లేదని కేవీపీ వ్యాఖ్యానించారు. జగన్ తనకు మేనల్లుడి వంటివాడని, జగన్ పుట్టకముందు నుంచే తాను వైఎస్ తో కలిసున్నానని అన్నారు. జగన్ తో తనకున్న అనుబంధం తెగిపోయేది కాదని స్పష్టం చేశారు. జగన్ తాను ఎంచుకున్న దారిలో నడుస్తున్నారని అన్నారు. తాను ప్రస్తుతం జగన్ తో ఎందుకు లేనన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పలేనని, దాని గురించి చర్చించే సమయం ఇది కాదని అన్నారు. యూపీఏలో జగన్ ను కలపాలని తనను అధిష్ఠానం కోరలేదని.. ఒకవేళ ఆ బాధ్యతలను తనకు అప్పగిస్తే నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని కేవీపీ స్పష్టం చేశారు. యూపీఏగానీ, కాంగ్రెస్ గానీ.. జగన్ కు సీట్లు పెరిగితే తమతో కలుపుకోవాలని చూస్తున్నాయన్న సంగతి తనకు తెలియదని అన్నారు.