మేఘా వెనుక కేవీపీ.! కాళేశ్వరం, పోలవరం కాంట్రాక్టులు అందుకే దక్కాయా?

కేవీపీ రామచంద్రరావు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి ఆత్మ... ఇప్పుడదే ఆత్మ రెండు రాష్ట్రాల్లోనూ, తెర వెనకుండి నడిపిస్తోందన్న వాదన, రాజకీయ వర్గాల్లో హాట్‌హాట్‌‌గా సాగుతోంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టుల విషయంలో కేవీపీ మాటే చెల్లుబాటు అవుతోందని అంటున్నారు. తెలంగాణ కాళేశ్వరం... ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టుల కాంట్రాక్టులను మేఘా సంస్థ దక్కించుకోవడం వెనుక కేవీపీనే ఉన్నారనే మాట వినిపిస్తోంది. అంతేకాదు, కేసీఆర్-జగన్ ఫ్రెండ్షిప్ వెనుకా కేవీపీయే ఉన్నారని పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోంది మేఘా సంస్థే... అయితే, మేఘాకి ఈ ప్రాజెక్టు దక్కడం వెనుక కేవీపీ కీలక పాత్ర పోషించారన్న వాదన ఉంది. ఎందుకంటే, ప్రత్యక్షంగా కనిపించకపోయినా, కేసీఆర్‌కు కేవీపీకి మంచి సంబంధాలున్నాయని అంటున్నారు. ఇద్దరి సామాజికవర్గం కూడా ఒక్కటే కావడమూ కారణమంటున్నారు. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోన్న కంపెనీయే ఇప్పుడు రివర్స్ టెండరింగ్ లో పోలవరం కాంట్రాక్టును దక్కించుకుంది. అయితే, మేఘా సంస్థ... పోలవరం కాంట్రాక్టు దక్కించుకోవడం వెనుక కూడా కేవీపీయే ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. వందల కోట్ల రూపాయల నష్టం వస్తుందని తెలిసినప్పటికీ, 12.6 శాతం తక్కువకు కోట్ చేస్తూ, మేఘా సంస్థ బిడ్ దాఖలు చేయడం వెనుక కేవీపీ వ్యూహం ఉందని మాట్లాడుకుంటున్నారు.

మేఘా కంపెనీ ఇంత తక్కువకు బిడ్ దాఖలు చేయడం వెనుక, కేవీపీతోపాటు జగన్ కూడా ఉన్నారనే మాట కూడా వినిపిస్తోంది. అందుకే, మేఘాకి పోలవరం కాంట్రాక్టు దక్కడంతో వైసీపీ నేతలు ఖుషీ అవుతున్నారట. మరోవైపు, మేఘా సంస్థలో కేవీపీకి భారీగా షేర్లు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అందుకే మేఘా కంపెనీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కాంట్రాక్టులు దక్కేలా చేస్తున్నారని అంటున్నారు.