రెండిటికి చెడ్డరేవడి కెవిపి రామచంద్ర
Published on: Sat Aug 4, 2012 9:44AM
గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్‌నాయకుడు పదవీ ప్రమాణం జరుగుతున్న సందర్బంగా మఖ్య మంత్రి, మంత్రులు పార్టీ కార్యకర్తల సమక్షంలో ఆవేశంగా దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటం ఎందుకు లేదంటూ కెవిపి ప్రశ్నించి దూమారం లేపారు. ధర్మాన కమిటీలో వైయస్ ముద్ర వుండకూడదని నిర్ణయం తీసుకున్న తర్వాత కే.వి.పి. ఇటువంటి దుమారం లేపడం విశేషం.ఇది ఇంతటితో ఆగేటట్టు లేదు. పోనీ కెవిపి దీని వల్ల సానుభూతిగాని, ప్రజాదరణకాని పొందిన దాఖలు ఏమీ లేదు. వి. హనుమంతరావు ఈ విషయంలో స్పందిస్తూ విజయలక్ష్మి సోనియాను, రాహుల్‌ని తిట్టినప్పుడు రాని నోరు ఇప్పుడు వైయస్సార్ ఫోటో కోసం వచ్చిందా అంటూ కడిగి పారేశారు. అలా అని వైయస్సార్ పార్టీ ఏమన్నా అభిమానించిందా అంటే అదీ లేదు. ఎన్నికల సమయంలో వైయస్ జగన్, విజయమ్మతో పాటు రాజశేఖర రెడ్డిని కూడా తిట్టి, నిందలు మోపి నప్పుడు మాట్లాడని కెవిపి ఇప్పుడు ఎందుకు ఈ అంశం లేవనెత్తారని వైసిపి నాయకురాలు కొండా సురేఖ ప్రశ్నించారు.
తర్వాతి రోజు వైయస్ కాంగ్రెస్ గౌరవాద్యక్షురాలు విజయమ్మ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ వైయస్ బ్రతికి ఉన్నప్పుడు ఇంటికి తిరిగిన వారంతా ఆయన చనిపోయాక మొఖం చూపించలేదని ఎద్దేవా చేశారు. అయితే రాజకీయ ప్రత్యర్థులు, కాంగ్రెస్‌లోని నాయకులు ఒప్పుకునేందేమంటే ఇప్పుడు రాజకీయంగా ఉన్నత పదవులను అధిష్టించిన వారంతా రాజశేఖరరెడ్డి పైకి తీసుకు వచ్చిన వారే అని. పరిస్థితులు, అవకాశవాదం వారిని మాట్లాడనీయక పోయి వుండవచ్చుకాని వారి మనసుకు తెలుసు వైయస్ వారికి ఎంత లిఫ్టు ఇచ్చారో. కాబట్టే అప్పుడప్పుడు ఇలా మనసులో మాట నాయకులకు బయటకు వచ్చేస్తూ వుంటుంది. ప్రజాసమస్యల పై దృష్టి సారించని నాయక గణం కే.వి.పి. వ్యాఖ్యలపై నానా రాద్దాంతం చేసింది. దీంతో మీడియాకు బోలెడంత పని. దీని మీద డిల్లీకి గుట్టలు గుట్టలుగా రిపోర్టులు వెళుతూనే ఉన్నాయి.ఇక్కడి వర్షాభావ పరిస్ధితి గాని, ఇంజనీరింగ్ విద్యార్దులు కౌన్సిలింగ్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును గాని, కరెంటు సమస్యవల్ల దివాళా తీస్తున్న పరిశ్రమల గురించిగాని అధిష్టానం దృష్టికి తీసుకురాని నాయకులు కే.వి.పి. వ్యాఖ్యలను మాత్రం వారి దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిసింది.


