మోహన్‌బాబు ఆరోపణల్లో నిజంలేదు

 

శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లింపుల్లో ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఆరోపిస్తూ మోహన్‌బాబు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అయితే మోహన్‌బాబు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. మోహన్ బాబు విద్యా సంస్థలకు విడుదల చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వివరాలను ఇవాళ ఆయన మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోహన్ బాబుకు చెందిన నాలుగు విద్యా సంస్థలకు.. 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ. 7051, 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ. 2,69,000, 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ. 64 వేలు, 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ. 1.86 కోట్లు, 2018-19  విద్యా సంవత్సరానికి సంబంధించి రూ. 4.53 కోట్లు మాత్రమే బకాయిలు ఉన్నాయన్నారు. మోహన్ బాబు ఆరోపణలపై చర్చకు సిద్ధమన్న కటుంబరావు.. 2014 నుంచి ఒక్క పైసా రాలేదని ఆయన ఎలా చెబుతారని ప్రశ్నించారు.  మోహన్ బాబు వ్యాపారం చేస్తున్నారా? విద్యా సంస్థను నడుపుతున్నారా? అని నిలదీశారు. తన విద్యా సంస్థల్లోని ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తీసుకుంటూ 25 శాతం మందికి ఉచితంగా విద్యనందిస్తానని ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.14,510 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇచ్చామని చెప్పారు. ప్రతిపక్షానికి మోహన్ బాబు వంతపాడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మోహన్‌బాబు ఆందోళనకు దిగడం వెనుక కారణమేంటన్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలపై ఆయన ఏ రోజైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. మోహన్ బాబుపై చాలా గౌరవం ఉండేదని.. ఇప్పుడు ఆ గౌరవం పోయిందని కుటుంబరావు అన్నారు.