విజయసాయిరెడ్డి ఎల్ 3.. కుటుంబరావు సంచలన వ్యాఖ్యలు

 

వైసీపీ నేత విజయసాయిరెడ్డికి సిగ్గు, శరం లేదని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఈరోజు అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కుటుంబరావు మాట్లాడుతూ విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. దేశంలో విజయసాయిరెడ్డి వాడుతున్న భాష కంటే ఘోరంగా ఏ నేతలు కూడా వాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఓ వ్యక్తి తనతో మాట్లాడుతూ..‘మా దగ్గర మూడు కేటగిరీలు ఉంటాయండీ. ఎల్1 అంటే లోఫర్, ఎల్2 అంటే లోఫర్-లఫూట్, ఎల్3 అంటే లోఫర్-లఫూట్-లఫంగా అని నేతలకు గ్రేడింగ్ ఇస్తాం’ అని చెప్పాడన్నారు. ప్రస్తుతం చూస్తే విజయసాయిరెడ్డి ఈ మూడో కేటగిరిలోకి వస్తాడని అనిపిస్తోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

విజయసాయిరెడ్డి ఓ మానసిక రోగంతో బాధపడుతున్నారని కుటుంబరావు విమర్శించారు. దీనినుంచి ఆయన బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఎప్పుడైనా ఆర్థిక శాఖ సమావేశాల్లో, నిర్ణయాల్లో పాలుపంచుకున్నానా? విజయసాయిరెడ్డి ఆరోపణలకు సాక్ష్యం చూపమనండి అని ప్రశ్నించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా 12 కమిటీల్లో ఉన్నాను. కాబట్టి కొన్ని ప్రత్యేక సమావేశాలకు మాత్రమే హాజరయ్యానన్నారు.

'సీనియర్ నేత యనమల గారిని అవమానించేలా విజయసాయిరెడ్డి మాట్లాడటం చాలా తప్పు. యనమల అనుభవంలో విజయసాయిరెడ్డి అనుభవం 1-2 శాతం మాత్రమే ఉంటుంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో తమపై చాలా అసభ్యమైన పదజాలం వాడుతున్నారనీ, ఇది నిజంగా బాధపడాల్సిన విషయమని కుటుంబరావు వ్యాఖ్యానించారు.

తాను కష్టపడి సంపాదించాననీ, అందువల్లే జాగ్రత్తగానే పెట్టుబడి పెడతానని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డిలా ఇతర కంపెనీలను ప్రభావితం చేసి డబ్బులు దొబ్బేయలేదని స్పష్టం చేశారు. ‘నా జీవితమంతా తెరచిన పుస్తకం. ఏదైనా కేసు నాపై ఉంటే చెప్పండి. నీపైన ఇంతపెద్ద చిట్టా ఉంది. మొన్న జగన్ పైన 31 పేజీలు అఫిడవిట్ లో పెట్టారంటే, నేను అనుకుంటున్నా విజయసాయిరెడ్డిపైన అంతే పెద్ద చిట్టా ఉంటుంది. కానీ రాజ్యసభ సభ్యుడు కాబట్టి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు’ అని విమర్శించారు.