కర్నూల్ విమానాశ్రయం ప్రారంభం.. చంద్రబాబు వరాల వర్షం

 

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు కర్నూల్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. జిల్లాలోని ఓర్వకల్లు వద్ద నూతనంగ నిర్మించిన కర్నూలు విమానాశ్రయాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఓర్వకల్లు, గడివేముల మండలాల్లో నిర్మించిన అల్ట్రా మెగా సోలార్ పార్క్‌ను జాతికి అంకితం చేశారు. రాష్ట్ర క్యాన్సర్‌ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఫార్మా క్లస్టర్, ఎంఎస్ఎంయీ పార్కులకు భూమిపూజ చేశారు. అనంతరం కోస్గి గ్రామంలో నిర్వహించిన 'జన్మభూమి - మాఊరు' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి అమరావతి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు విమాన సర్వీసులు ఉంటాయని తెలిపారు. కర్నూలు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జలధార ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. కర్నూల్ జిల్లాలో 97 లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేశామన్నారు. మిగిలిన రెండు త్వరలో పూర్తి చేస్తామని స్సష్టం చేశారు. త్వరలో ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ హబ్‌గా మారుతుందని చెప్పారు. 200 ప్రముఖ కంపెనీలు ఓర్వకల్లుకు వచ్చే అవకాశముందని ఆయన అన్నారు. గని అల్ట్రా మెగాపవర్‌ సోలార్ పార్కు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ప్రాజెక్టని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు.