ఒక రైలును తప్పించబోయి..మరో రైలు కిందపడిన తల్లీకూతుళ్లు

చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం చోటు చేసుకుంది. తల్లీకూతుళ్లు ఒక రైలును తప్పించుకోబోయి..మరో రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని దళవాయికొత్తపల్లెకు చెందిన కలీం కుటుంబం కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తోంది. కలీం భార్య హల్మాన్స, కుమార్తె తరానా నిన్న ఇంట్లోకి సరుకులు కొనేందుకు కుప్పం వెళ్లారు. సరుకులు కొని స్థానిక టీటీడీ కళ్యాణ మండపం పక్కనే ఉన్న సందులోంచి రైలు పట్టాల మీదకు వచ్చారు. ఆ సమయంలో చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చింది. దాన్ని తప్పించుకునే క్రమంలో తళ్లీకూతుళ్లు పక్కనే ఉన్న మరో ట్రాక్ మీదకు దూకారు. అదే సమయంలో అ వైపు నుంచి గూడ్స్ దూసుకొచ్చింది. దీంతో హతాశులైన తల్లీబిడ్డకు ఎటు వెళ్లాలో పాలుపోక ఇద్దరు పట్టాల మీదే నిలబడిపోయారు. వారిద్దరినీ గూడ్స్ రైలు బలంగా ఢీకొనడంతో పక్కనే ఉన్న కాలువలో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తల్లీకూతుళ్లు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి చివరికంటూ ప్రయత్నించారు. కాని విధి ముందు తలవంచక తప్పలేదు..ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మృతదేహలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.