టికెట్ రాలేదా?..పార్టీ పదవి ఖాయం!!

 

తెరాస పార్టీని గద్దె దింపాలని మహాకూటమిగా ఏర్పడ్డాయి ప్రతిపక్ష పార్టీలు.ఉమ్మడి ఎన్నికల ముసాయిదా కూడా సిద్ధం చేసాయి.కానీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ మాత్రం పూర్తి కాలేదు.అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు ప్రారంభించింది.తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ కుంతియా,పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ లో పార్టీ సీనియర్‌ నేతలు గులాంనబీ ఆజాద్‌, ఏకే ఆంటోనీలను కలిశారు.మహాకూటమి, సీట్ల సర్దుబాటు అంశాలపై చర్చించారు. తెదేపా, సీపీఐ, తెజస నేతలతో చర్చించిన అంశాలను కోర్‌కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.

కుంతియా భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు.మహాకూటమిపై చర్చల్లో పురోగతి బాగుందని,చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని,త్వరలోనే సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తుందన్నారు.తెజస, కాంగ్రెస్‌సీట్ల సర్దుబాటు విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని పార్టీ శ్రేణులను కోరారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై కోదండరాంతో మూడు సార్లు చర్చించినట్లు వివరించారు. ఈ నెల చివరిలోగా సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని కుంతియా పేర్కొన్నారు. ఈ నెల 20న రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటిస్తారని, త్వరలో సోనియాగాంధీ కూడా పర్యటించనున్నారని తెలిపారు.కొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, ముగ్గురు బలమైన అభ్యర్థులున్నారని,టికెట్‌ రాని వారు నిరాశ చెందొద్దని,పార్టీ అధికారంలోకి వచ్చాక,ప్రభుత్వంలో పదవులు ఇచ్చి వారికి న్యాయం చేస్తామని అన్నారు.