రికార్డు కెక్కనున్న జానారెడ్డి
Published on: Fri Aug 17, 2012 8:30AM
రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేకతను చాటుకున్న పంచాయితీ రాజ్ శాఖామంత్రి కుందూరు జానారెడ్డి మరోవారంరోజుల్లో రికార్డు సృష్టించనున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌నుండి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జానారెడ్డి తెలుగుదేశం అభ్యర్దిగా రాజకీయ ఆరంగ్రేటం చేశారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలచి పలుసార్లు ఎన్టీఆర్ క్యాబినెట్‌లో అనేక శాఖలు నిర్వహించారు. తరువాత కాంగ్రెస్ లో మరో 3 సార్లు ఎన్నికయ్యి పదవులు దక్కించు కున్నారు. ఆయన 7 సార్లు ఎన్నికల్లో పోటీచేయగా కేవలం ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. గెలచిన ప్రతిసారీ క్యాబినెట్ మంత్రిగా పని చేశారు. ఈనెల 24తో రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రిగా కొనసాగిన వ్యక్తిగా చరిత్రకెక్కనున్నారు. వివాదాలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండే జానారెడ్డి వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సల్స్ అణచివేతలో కీలక పాత్ర వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ పరిణామాలు మారినప్పుడల్లా ముఖ్యమంత్రి పదవికి జానారెడ్డి పేరు వినిపిస్తూ ఉంటుంది. అయితే అత్యధిక కాలం రాష్ట్ర మంత్రిగా చేసిన అనుభవం ఉన్న తమ నాయకుడు ఏనాటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న విశ్వాసంతో ఆయన అనుయాయులు ఉన్నారు.


