కుమారస్వామి ఏడ్చాడు! కాంగ్రెస్ ఏడ్పించింది! మోదీ నవ్వబోతున్నాడు!

కుమారస్వామి కంటతడి పెట్టారు. ఇది నిజంగా షాకింగే! మరీ ఆశ్చర్యపోవాల్సిన విషయమూ కానప్పటికీ… 2019లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కర్ణాటక సీఎం కంటతడి తప్పకుండా మాట్లాడుకోవాల్సిన విషయమే. అసలింతకీ ఆయనెందుకు ఏడ్చారు? నలభై సీట్లు కూడా లేని జేడీఎస్ నేత నక్క తోక తొక్కినట్టు అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ భయంతో కాంగ్రెస్ అతడ్ని బంపరాఫర్ ఇచ్చి రథ సారథని చేసింది. యడ్యూరప్ప సీఎం అవ్వకుండా ఆపగలిగింది. మరో రాష్ట్రం మోదీ వశం కాకుండా అడ్డుకుంది. కానీ, కాంగ్రెస్ మార్కు రాజకీయం నిత్యం భరిస్తూ ముళ్లపాన్పు లాంటి సీఎం కుర్చీపై కూర్చోటం కుమారస్వామికి ఎంత కష్టమో త్వరగానే తెలిసిపోయింది!

 

 

చరిత్రలో అనేక సార్లు కాంగ్రెస్ సంకీర్ణ  ప్రభుత్వాల్లో వుంటూ వచ్చింది. కానీ, ఎప్పుడూ కూడా తాను ప్రధాన పార్టీగా వుంటేనే ఆ గవర్నమెంట్లు అయిదేళ్లు నెగ్గుకొచ్చాయి. కాంగ్రెస్ మద్దతు ఇస్తూ మరో పార్టీ ప్రభుత్వం నడుపుతుంటే … ఆ సర్కార్ అయిదేళ్లు నడవటం అసాద్యమే. ఇది పదే పదే హస్తం నేతలు నిరూపించారు. కాంగ్రెస్ వ్యవహారంతో కొందరు ప్రధాని పదవులు కోల్పోతే అనేక మంది సీఎం పదవులు కోల్పోయారు. ఇప్పుడు కుమార స్వామి వంతు అన్నట్టు కనిపిస్తోంది పరిస్థితి.

తనకు విషం తాగుతున్నంత కష్టంగా వుందని పార్టీ నాయకులు, కార్యకర్తల ముందు ఏడ్చేశాడు దేవెగౌర రాజకీయ వారసుడు. ఆ విషం తాగిస్తున్నది సంకీర్ణంలోని కాంగ్రెస్సేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! ఒకవైపు నుంచీ మాజీ సీఎం సిద్దరామయ్య, మరో వైపు నుంచీ డాక్టర్ శివ కుమార్, మధ్యలో మల్లిఖార్జున ఖర్గే… ఇలా ఎవరికి వారు కన్నడ ప్రభుత్వంలో వేలు పెడుతున్నారు. కుమార స్వామి ఫ్రస్ట్రేషన్ కి కారణం అదే! ఆయన నిమిత్తమాత్రుడైన సీఎంలా మిగిలిపోయే ప్రమాదం పొంచి వుంది. అలా రబ్బర్ స్టాంప్ లా వుండటం ఖచ్చితంగా ఓ ప్రాంతీయ పార్టీ నాయకుడైన కుమార స్వామికి రాజకీయంగా ఆత్మహత్య అవుతుంది. అదే ఆయన దుఃఖానికి కారణం!

 

 

కుమార స్వామిని ముఖ్యమంత్రిగా జనం ముందు పెట్టి తరువాత అతడ్ని ఏమీ చేయకుండా అడ్డుకుంటున్నారు కన్నడ హస్తం నేతలు. వాళ్లు అలా చేస్తుండటంతో చెడ్డ పేరంతా కుమార స్వామి భరించాల్సి వస్తుంది. ఇది ముందు ముందు జేడీఎస్ పై జనం ఆగ్రహించే స్థితి తీసుకు రావచ్చు. అదే సమయంలో మరింత మంది ఓటర్లు బీజేపి వైపు మొగ్గ చూపవచ్చు. కాంగ్రెస్ ఆకతాయితనం వల్ల పార్లమెంటు ఎన్నికల ముందో తరువాతో మళ్లీ కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు వస్తే కమలానికి జనం స్పష్టమైన మెజార్టీ ఇవ్వొచ్చు. ఇదే కుమార స్వామి భయమంతా! అయినా కూడా కర్ణాటక కాంగ్రెస్ నేతల మాటలు ఆందోళనకరంగా వుంటున్నాయి. కుమార స్వామి కంటతడిపై కామెంట్ చేసిన మల్లిఖార్జున ఖర్గే… ఆయన ఇబ్బందుల్ని పరిష్కారిస్తామని అనలేదు. కాంగ్రెస్ మరింత సహకరిస్తుంది అని కూడా అనలేదు. సంకీర్ణంలో ఇలాంటి ఒత్తిళ్లు సహజం. తట్టుకుని ముందుకు సాగాలి అని సెలవిచ్చారు! అంటే, తమ వైపు నుంచి పెద్దగా మార్పుండదని చెప్పకనే చెప్పేశారు!

 

 

జేడీఎస్ కి, కర్ణాటక కాంగ్రెస్ కి మధ్య గొడవ నిజానికి జాతీయ సమస్య కాదు. అది ఆ రాష్ట్రానికే పరిమితం. కానీ, త్వరలోనే పార్లెమంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కర్ణాటక పరిణామాలు దిల్లీపై కూడా ప్రభావం చూపుతాయి. ఎలాగంటే, ఏ క్షణమైనా కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం కూలితే అది మోదీ, షాలకు బంగారు ఆవకాశం. జనం ఎంపీ ఎన్నికల్లో బీజేపీకే జై కొట్టే చాన్స్ వుంటుంది. కాంగ్రెస్ , జేడీఎస్ లను నమ్మకపోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం కూలకపోయినా… కుమారస్వామి చేత నిత్యం విషం తాగిస్తూనే కాంగ్రెస్ వారు ఇబ్బంది పెడితే… అది కూడా రెండు పార్టీలకు నష్టమే. ఎన్నికల్లోపు ఎంతో కొంత మంచి చేస్తేనే ఓటర్లు బీజేపికి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. లేదంటే, రాహుల్, కుమారస్వామి, సిద్దరామయ్య లాంటి వారి కంటే మోదీనే బెటర్ అని ఆయన వైపు మొగ్గు చూపుతారు.పైగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఛరిష్మా కూడా పని చేస్తుంది. ఇలా ఎలా చూసినా కుమార స్వామి కంటతడి… యడ్యూరప్ప ఆనందభాష్పాలుగా మారే సూచనలు పుష్కలంగా వున్నాయి.

దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటక, దక్షిణాదిలో కాంగ్రెస్ కు ఇంకా కాస్త పట్టుమిగిలిన కన్నడ నాట… హస్తం పార్టీ చాలా జాగ్రత్తగా వుంటే తప్ప మోదీని నిలువరించటం సాద్యం కాదు. ఈ విషయం గుర్తు పెట్టుకుని రాహుల్ కన్నడ కాంగ్రెస్ నేతల్ని నియంత్రించి కుమారస్వామి కళ్లు తుడిచే ప్రయత్నం చేయాలి! లేదంటే… మోదీకి కావాల్సిన ఎంపీ సీట్లు, యడ్యూరప్పకి కావాల్సిన ఎమ్మెల్యే సీట్లు రెండూ త్వరలోనే కమలం ఖాతాలో పడిపోవచ్చు!