మోడీపై స్వామి కామెంట్లు...బ్లాక్ మనీ వాడుతున్నారు..

 

ఎలాగైనా సరే కర్ణటాకలో అధికారం చేపట్టాలని ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు పార్టీలు జేడీఎస్ కు ఆఫర్ల  మీద ఆఫర్లు ఇస్తున్నారు. అయితే తాము కాంగ్రెస్ కే మద్దతు ఇస్తున్నామని ఇప్పటికే జేడీఎస్ కూడా చెప్పేసింది. ఇక ఈ రోజు మీడియా సమావేశంలో పాల్గొన్న కుమారస్వామి ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని... తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వైపు వస్తే రూ.100 కోట్లు ఇస్తామని చెప్పారని చెప్పడం కలకలం రేపేలా ఉంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నల్లధనం వినియోగిస్తోందని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వ సంస్థలతో తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు..కర్నాటకలో బీజేపీ గెలుపు మోడీ గెలుపు కాదన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మద్దతిచ్చేది లేదన్నారు. అధికారం కోసం బీజేపీ తహతహలాడుతోందన్నారు. బీజేపీని నిరోధించేందుకు తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తామన్నారు. అంతేకాదు బీజేపీ యాత్ర ఉత్తరాదిన ప్రారంభమైందని, కానీ దక్షిణాన కర్ణాటకలో ఆగిపోయిందని కుమారస్వామి వ్యాఖ్యానించారు. బీజేపీ ఆపరేషన్ కమలను ఆపేయాలని, వారు ఒక్కరిని తీసుకుంటే మేం ఇద్దరిని తీసుకోగలమని, బీజేపీని వీడాలనుకునే వారు తమతో కలిసి రావాలని కుమారస్వామి పిలుపునిచ్చారు.