మరో ములుపు తిరిగిన కన్నడ రాజకీయం...ఆసుపత్రిలో చేరిన కుమారస్వామి !

 

గత నెలరోజుల నుండి ఉత్కంఠ రేకెత్తిస్తున్న కర్ణాటక రాజకీయం ఈరోజుకి అయినా తెరపడనుందా ? అంటే చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. బల పరీక్షపై శాసనభలో కొనసాఆఆఆఆగుతూనే ఉన్న చర్చ ఈరోజు ముగియనుంది. ఆ తర్వాత ఓటింగ్‌ జరిగితే ఈ సర్కార్ ఉండేది ఉండనిది తెలిపోనుంది. అయితే ఈరోజు కూడా ఏదైనా చేసి విశ్వాస పరీక్ష వాయిదా వేస్తే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. 

మరోపక్క ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామేనని బీజేపీ భావిస్తుంటే, ముఖ్యమంత్రి పదవిని కాంగ్రె్‌స్ కే వదిలేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబట్టుకోవాలని జేడీఎస్‌ భావిస్తోంది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా ముఖ్యమంత్రి కుమారస్వామి, జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ నివాసంలోనే మకాం వేసి కాంగ్రస్ నేతలతో చర్చించారు. సభలో తమ బలం నిరూపించుకోవడం అసాధ్యమని భావించిన వీరు రెబల్ ఎమ్మెల్యేలకు సీఎం పదవి, మంత్రి పదవులను ఆఫర్ చేశారు.

అయినా వారు దిగిరాకపోవడంతో అస్వస్తత పేరుతో ముఖ్యమంత్రి కుమారస్వామి ఆస్పత్రిలో చేరారు. హైబీపీ తదితర కారణాలతో సీఎం బెంగళూరులోని అపోలో హాస్పటిల్‌లో చేరారు. అయితే ఈరోజు అసెంబ్లీలో విశ్వాస పరీక్షను కుమారస్వామి సర్కార్ ఎదుర్కోనున్న నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో చేరడంతో ఆయన కొత్త డ్రామాకు తెరలేపారని, సాధ్యమైనంత వరకూ బలపరీక్షను పొడిగిస్తూ పోవాలన్నదే ఆయన ఆలోచనగా కనిపిస్తోందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. 

అయితే కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆ రెండు పార్టీలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నప్పటికీ కర్ణాటక రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు మాత్రం అది సాధ్యపడేలా లేదని చెప్పకనే చెబుతున్నాయి.  ఈ నేపథ్యంలో నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.