చంద్రబాబు, కేసీఆర్ సహకరించాలి..


కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఎంత ఉత్కంఠ రేకెత్తించాయో తెలుసు. ఇక ఫలితాలు వచ్చిన తరువాత హంగ్ ఏర్పడటంతో ఎవరు అధికారం పడుతారో కూడా అందరూ ఆసక్తికరంగా ఎదురుచూశారు. బీజేపీ 104 స్థానాలు, కాంగ్రెస్ 78 స్థానాలు, జేడీఎస్ 38 రావడంతో.. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోకపోవడంతో హంగ్ ఏర్పిడింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేశారు. కానీ జేడీఎస్ మాత్రం బీజేపీకి షాకిచ్చి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది. దీంతో ఇంకేముంది కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది అనుకున్నారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీదే హవా కాబట్టి.. వాళ్లు చక్రం తిప్పేశారు. దానిలో భాగంగానే గవర్నర్ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కూడా ఇచ్చేశారు. దీంతో యడ్యూరప్ప సీఎంగా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు.  బెంగళూరులోని రాజ్ భవన్ లో గవర్నర్ వాజూభాయ్ ఆయనతో ప్రమాణం చేయించారు.

 

ఇదిలా ఉండగా బీజేపీ చేసిన పనికి జేడీఎస్ నేత కుమారస్వామి కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ కలసి ఐకమత్యంతో పోరాడాల్సిన సమయం వచ్చిందని, తమ పోరాటానికి కలసి రావాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, టీఆర్ఎస్ నేత కేసీఆర్ తమకు సహకరించాలని జేడీఎస్ నేత కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. ఇటీవల కేసీఆర్ స్వయంగా బెంగళూరుకు వెళ్లి కుమారస్వామి, దేవెగౌడలతో తృతీయ కూటమిపై చర్చలు జరిపి వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా కలసి పోరాడాలని నిర్ణయించుకున్నందునే ఇప్పుడు తమకు మద్దతివ్వాలని కేసీఆర్ ను కుమారస్వామి కోరినట్టు తెలుస్తోంది. ఇక చంద్రబాబు కూడా బీజేపీతో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో, ఆయన వైపు నుంచి కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కుమారస్వామి భావిస్తున్నట్టు సమాచారం. మరి కేసీఆర్, చంద్రబాబు దీనిపై ఎలా స్పందిస్తారో మరి చూద్దాం..