అత్యాచారం కేసు...బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ అరెస్ట్...

 

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగార్ పై అత్యాచార ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. యూపీ లోని ఉన్నావో జిల్లాలో 16ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. గత ఏడాది జూన్‌ 4న సెంగర్‌ తనపై అత్యాచారం చేశాడని, ఫిర్యాదు చేస్తే తన కుటుంబాన్ని చంపేస్తాడని బెదిరించాడని బాలిక ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మళ్లీ తనను అపహరించి తొమ్మిది రోజుల పాటు మత్తు పదార్థాలు ఎక్కించి అనేక ప్రాంతాలు తిప్పుతూ పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది.  అయితే ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోయింది. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో యోగి ఆదిత్యనాథ్‌ అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన కుల్‌దీప్‌పై కేసు నమోదు చేయాలని ఉన్నత స్థాయి పోలీసు అధికారిని ఆదేశించారు. ఆయనకు సంబంధించి అన్ని కేసులను సీబీఐకి అప్పగించాలని చెప్పారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది.

 

ఇక కేసు విచారించిన సీబీఐ కుల్ దీప్ సింగ్ సెంగార్ ను అరెస్ట్ చేసింది. ఈకేసులో ప్రాధమిక సాక్ష్యాలు ఉన్నాయని గుర్తించి, ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు సీబీఐ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్నావోకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మఖీ పోలీసు స్టేషన్ లో కుల్ దీప్ పై మూడు కేసులను రిజిస్టర్ చేసిన సీబీఐ, ఆయనపై పోస్కో చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్లను జోడించింది. ఈ తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో లక్నోలోని కుల్ దీప్ నివాసానికి వెళ్లిన అధికారులు, ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్టు తెలిపి తీసుకుని వెళ్లారు.