కూకట్ పల్లి కేంద్రంగా భానుగ్యాంగు దందాలు?
Published on: Sat Apr 28, 2012 10:01AM
మద్దెలచెర్వు సూరి హత్యకేసులో ప్రధాననిందుతుడైన భాను, సురేఖ, అతని అనుచరులు కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీని అడ్డాగా చేసుకుని అక్రమదందాలు, బెదిరింపులకు పాల్పడినట్టు తెలిసింది. ఈ గ్యాంగ్ సభ్యులకు స్థానిక పోలీసులు, రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో వారి ఆగడాలకు హద్దు లేకుండా పోయిందని తెలిసింది. భాను అరెస్టు కావటంతో ఈ గ్యాంగు కూకట్ పల్లి నుంచి అదృశ్యమైపోయింది.
ఒకప్పుడు భయంతో బిక్కుబిక్కు మంటూ కాలం గడిపిన బాధితులు ఇప్పుడు తమకు జరిగిన అన్యాయంపై పోలీసులతో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ గ్యాంగు 15 నెలల పాటు కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీని కేంద్రంగా చేసుకుంది. బెదిరింపులతో తక్కువ ధరకు ఇళ్ళు, స్థలాలు దక్కించుకున్నారు. ఎవరైనా అడ్డువస్తే రాజకీయపలుకుబాడితో కేసులు పెట్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేవారు. భానుగ్యాంగు ఆగడాలతో ఆర్థికంగా నష్టపోయిన పలువురు మానసికస్థైర్యం కోల్పోయి దైన్య స్థితిలో కాలం గడుపుతున్నట్లు తెలిసింది.


