కేటీఆర్ ట్వీట్... లోకేష్ రీట్వీట్… మారుతోన్న రాజకీయం!

రాజకీయాలు మారిపోతున్నాయి. మన పాలిటిక్స్ లో పాత తరం నేతలు తమ వారసుల్ని వేగంగా దించేస్తున్నారు. కొత్త నేతల రాకతో పాలిటిక్స్ నడిచే తీరు కూడా మారుతోంది. తాజాగా ట్విట్టర్ లో తెలంగాణ సీఎం వారసుడు కేటీఆర్, ఆంధ్రా సీఎం వారసుడు లోకేష్ మధ్య జరిగిన సంభాషణ దానికే అద్దం పడుతుంది! ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లిస్ట్ లో రెండు తెలుగు రాష్ట్రాలు తొలి రెండు స్థానాలు గెలుచుకుని దేశం దృష్టిని ఆకర్షించాయి. దానిపైనే యువ నేతలిద్దరూ ట్వీట్లు పోస్టు చేశారు.

 

నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ కు శుభాకాంక్షలు చెబుతూనే కేటీఆర్ జస్ట్ మిస్ అన్నారు. కేవలం 0.09 శాతం తేడాతో ఫస్ట్ ర్యాంక్ మిస్సయ్యాం అన్నారు. దానికి స్పందించిన లోకేష్ రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో వున్నాయన్నారు! ఇది తెలుగు ప్రజల మంచికే తప్ప ర్యాంకుల రేస్ మన మధ్య ఏం లేదని అభిప్రాయం వెలిబుచ్చారు. ఇది నిజంగా పరిణతి చెందిన సమాధానం అనే చెప్పాలి. నిజానికి కేటీఆర్ ఆంద్రప్రదేశ్ కు శుభాకాంక్షలు చెప్పటం హర్షనీయం. అంతకంటే ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటేనన్న భావం ధ్వనించేలా లోకేష్ స్పందించటం మరింత ఆనందదాయకం. ఈ సందర్భంగా మనం ఒక్కసారి విభజనకు ముందు పరిస్థితి గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఆశ్చర్యమనిపిస్తుంది. అప్పట్లో తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చినా కూడా కేసీఆర్ పదే పదే టీడీపీని టార్గెట్ చేసేవారు. అప్పుడు తెలుగు దేశం నేతలు ఘాటుగానే ప్రతి దాడి చేసేవారు. అటువంటి స్థితి నుంచీ ఇప్పుడు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుని వెన్నుతట్టి ప్రొత్సహించుకునే స్థితికి రావటం ఖచ్చితంగా గుణాత్మక మార్పే!

 

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల ప్రకటన మరో విషయం కూడా తేటతెల్లం చేసింది. విభజన ఎంత మాత్రం మంచిది కాదన్న వాదన తప్పని నిరూపించింది. దేశంలో ఎన్నో రాష్ట్రాలు వుండగా కొత్తగా ఏర్పడ్డ మన రెండు రాష్ట్రాలే టాప్ లో వుండటం విభజన కారణంగానే! విడిపోవటం వల్ల ఏపీ ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నప్పటికీ నెంబర్ వన్ గా నిలవటం నిస్సందేహంగా గొప్ప విషయం. ఇక్కడ వాణిజ్యానికి వున్న పుష్కలమైన అవకాశాలకి ఇది సంకేతం. అలాగే, హైద్రాబాద్ లాంటి బిజినెస్ హబ్ తో సహా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ సహజంగానే టాప్ గేర్లో దూసుకుపోతోంది. ఇదంతా విభజన వల్ల సాధ్యమైందనే చెప్పాలి!

 

మొత్తానికి… అనేక సంక్షోభాలు, గందరగోళాల నడుమ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు నేల ఇప్పుడు యావత్ దేశం చూపుని కట్టిపడేస్తోంది. కేసీఆర్, చంద్రబాబు శకంలో ఉప్పు, నిప్పుగా వున్న టీఆర్ఎస్, టీడీపీ ఇప్పుడు సుహృద్బావంతో మెలుగుతున్నాయి. కేటీఆర్, లోకేష్ లు మంత్రులుగా, కాబోయే ముఖ్యమంత్రులుగా కొత్త రాజకీయంతో నవశకంలోకి తీసుకెళుతున్నారు. ఇదంతా తెలుగు వారికి ఒక విధంగా సంతోషదాయకమైన పరిణామమే!