నల్గొండ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగం...

 

నల్గొండ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, నల్లగొండ లోని మెడికల్ కాలేజ్, సూర్యాపేట మెడికల్ కాలేజ్ లో ఇప్పటికే తమ అడ్మిషన్ లను ప్రారంభించాయని, తమ పనిని ప్రారంభించాయని, వాటికి పక్కా భవనాలతో పాటుగా బ్రహ్మాండమైన ఆస్పత్రుల నిర్మాణం కూడా టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం చేస్తుందని తెలిపారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ఈ రోజు ప్రపంచమే అబ్బురపడి చూసే విధంగా, తిరుమల తిరుపతి ధీటుగా నాలుగైదు వందల కోట్ల రుపాయలతో నల్లగొండ జిల్లాలో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అన్నారు. మల్కాపూర్ ప్రాంతంలో చౌటుప్పల్ మండలంలో ఒక పారిశ్రామిక ఫార్చ్యూన్ ను త్వరలోనే ప్రారంభోత్సవం చేయబోతున్నామని, తద్వారా స్థానికులకి పన్నెండు నుంచి పదమూడు వేల మందికి అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారని తెలిపారు.

ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పానగల్ చెరువు విషయంలో ఒక మినీ ట్యాంక్ బండ్ డెవలప్ చేయమని కోరారని, పురపాలకశాఖ నుండి వారు కోరిన విధంగా ముప్పై ఐదు కోట్ల రుపాయలు అతి త్వరలో మంజూరు చేసి నల్లగొండకు మినీ ట్యాంక్ బండ్ ని అందజేస్తామని మాటిస్తున్నామన్నారు. భవిష్యత్ లో బతుకమ్మ పండుగకి ఆ మినీ ట్యాంక్ బండ్ మీదకే వెళ్ళే విధంగా చక్కటి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.