ఏపీ-తెలంగాణలను మళ్లీ కలిపేస్తారు.. బీజేపీపై కేటీఆర్ డౌట్..
Published on: Wed Feb 16, 2022 3:35PM
భారతీయ జనతా పార్టీకి మరోసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే.. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపేస్తారంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దేశంలోని రైల్వేలు, ఎయిరిండియా, ఎల్ఐసీ లాంటి అనేక సంస్థలను మోడీ అమ్మేస్తున్నారు. మీరు ఓ నాలుగు రోజులు ఛాన్సిస్తే తెలంగాణను తీసుకెళ్లి మళ్లీ ఆంధ్రాలో కలిపేస్తారు. మిమ్మల్ని, మమ్మల్ని కూడా అమ్మేస్తారు. బీజేపీ నేతల లొల్లికి పొరపాటున యువత ఆగమైతే.. మళ్లీ తెలంగాణను ఆంధ్రను కలిపేసేంత పుణ్యాత్ములు ఈదారుణమైన మనుషులు అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్లో రిజర్వాయర్ నిర్మానానికి భూమి పూజ చేసిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడేళ్లలో దేశంలో 157 వైద్య కళాశాలలను కేంద్రం మంజూరు చేస్తే.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఉత్తర భారతదేశంలో, బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే మెడికల్ కాలేజీలు ఇచ్చారని దుయ్యబట్టారు. అలాగే.. 8 ఐఐఎంలు, 16 ఐసెర్ లు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని తూర్పారపట్టారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పే దమ్ము కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు ఉందా? అంటూ కేటీఆర్ సవాల్ చేశారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని బీజేపీ నేతలను కేటీఆర్ చాలెంజ్ చేశారు.
అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర పుట్టుకనే ప్రశ్నించే స్థితిలో ప్రధాని మోడీ ఉన్నారని కేటీఆర్ అన్నారు. అన్యాయంగా తలుపులు మూసి తెలంగాణను ఇచ్చారని అని ప్రశ్నిస్తున్న మోడీకి మళ్లీ ఛాన్సిస్తే.. ఆగమాగం అయిపోతామని హెచ్చరించారు. మోడీ అలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే తెలంగాణలోని బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని నిలదీశారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న బీజేపీ మనకు అవసరమా? అనేది ప్రజలే ఆలోచించాలని సూచించారు. పక్కనే ఉన్న కర్ణాటకలో ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన మోడీ తెలంగాణలోని కాళేశ్వరం, పాలమూరు ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. గిరిజన వర్శిటీని అడిగితే.. వాట్సాప్ యూనివర్శిటీని బాగా నడుపుతున్నారని, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. తెలంగాణకు ఏది కావాలని అడిగినా ప్రధాని మోడీ పట్టించుకోరని అన్నారు. ఈ దేశానికి ఆయన ఏం చేస్తారో చెప్పరు.. ఎల్ఐసీకి రైతు బీమా అవకాశం తెలంగాణ ప్రభుత్వం ఇస్తే.. మోడీ మాత్రం దాన్ని ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
బీజేపీ నేతలు ముస్లింల మీద విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెల్లారి లేస్తే విషం నింపుతున్నారని, ద్వేష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతల శరీరం అంతా విషం నిండిపోయింది తప్ప విషయం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలను మన రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా చేయాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. యూపీకి, ఉత్తర భారతదేశానికి మాత్రమే ప్రధానిగా మోడీ వ్యవహారం ఉందన్నారు. తెలంగాణకు ఒక్క పని కూడా చేయడంలేదని కేటీఆర్ నిప్పులు చెరిగారు.


