TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిట్టినాయుడు టీంకు సినిమా చూపిస్తా...కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Published on: Mon Jun 22, 2026 3:49PM

 

బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిపైనా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు. వచ్చే ఐదేళ్ల చిట్టినాయుడు, అండ్ టీం'కు సినిమా చూపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గడిచిన కాలంలో తమను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరినీ, తమ పార్టీ నేతలపై కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కేటీఆర్ హెచ్చరించారు. కష్టకాలంలో పార్టీతో కలిసి నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తను, నాయకుడిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్తాయని పిలుపునిచ్చారు.

ఈ రాజకీయ యుద్ధంలో తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ప్రతి అక్రమ కేసును చట్టపరంగా మరియు రాజకీయంగా ఎదుర్కొంటామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ప్రభుత్వం తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి కుతంత్రాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాబోయే ఐదేళ్ల కాలంలో ప్రతిపక్షంగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామని, అధికార పక్షానికి చుక్కలు చూపిస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు. వర్దన్నపేట వేదికగా కేటీఆర్ చేసిన ఈ సుదీర్ఘ, ఘాటైన ప్రసంగం బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.