TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పట్టిసీమ విషయంలో చంద్రబాబు విజన్ భేష్.. కేటీఆర్.!

Published on: Thu Jul 16, 2026 3:02PM

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటరు. అయితే, సిద్ధాంతాలు, పార్టీల పరంగా ఎంతటి రాజకీయ వైరం ఉన్నా.. ప్రత్యర్థుల విజన్‌ను,  వారు చేసే మంచి పనులను బహిరంగంగా అభినందించడానికి చాలా మంది వెనుకాడతారు. మంచిని మెచ్చుకోవడం పక్కన పెడితే.. అసలు ఆ మంచిని గుర్తించడానికి కూడా ఇష్టపడకుండా విమర్శలు సంధించడమే లక్ష్యంగా వారు ముందుకు సాగుతుంటారు. ఇటీవలి కాలంలో రాజకీయ ప్రత్యర్థులంటే.. వ్యక్తిగత శత్రువులు అన్నట్లుగా వ్యవహరిస్తున్న నేతల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు కూడా  కొందరు నాయకులు ప్రత్యర్థుల విజన్ ను వేనేళ్ల పొగిడేందుకు ఇసుమంతైనా వెనుకాడని నాయకులు ఉన్నారు. అటువంటి నేతలలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు కూడా ఒకరు.    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్..  తాజాగా చంద్రబాబు  పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.  దేశ రాజధాని  ఢిల్లీలో జరిగిన ఒక కీలక ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న సాగునీటి వ్యూహాలను,  సంక్షోభ నిర్వహణ తీరును ప్రత్యేకంగా కొనియాడారు.

ప్రస్తుత సీజన్‌లో ఎల్ నినో   ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా తీవ్రమైన పొడి వాతావరణం నెలకొంది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించిందని కేటీఆర్ ప్రశంసించారు. తీవ్రమైన నీటి కొరత ముంచుకొస్తున్న తరుణంలో..  ఏపీ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టి స్థానిక రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కాపాడిందన్నారు. ఇందుకు చంద్రబాబు ముందు చూపు, పాలనాదక్షతే కారణమని కేటీఆర్ విస్పష్టంగా చెప్పారు.  వ్యవసాయ క్యాలెండర్‌ను నిశితంగా పరిశీలిస్తూ, పంట నష్టాలు రాకుండా ఏపీ ప్రభుత్వం తీసుకున్న సమయానుకూల నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయన్న కేటీఆర్.. చంద్రబాబు నాయుడు మానస పుత్రికగా పిలవబడే  పట్టిసీమ ఎత్తిపోతల పథకం గురించి  ప్రస్తావించారు. ఇంతటి క్లిష్ట సమయంలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించి, రైతులను ఆదుకోవడంలో ఆయన చూపిన అంకిత భావం అభినందనీయమ న్నారు. 

ఇదే సమయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రైతు ప్రయోజనాల కోసం శరవేగంగా అడుగులు వేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం కనీస శ్రద్ధ చూపకుండా రైతాంగాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నదన్నారు. 

చంద్రబాబు పాలనా దక్షతను, విజన్ ను కల్వకుంట్ల తారకరామారావు బహిరంగంగా ప్రశంసించడం, అంగీకరించడం ఇదే మొదటి సారి కాదు.  గతంలోనూ రాజకీయంగా తీవ్ర విమర్శలు చేసినప్పటికీ, సుపరిపాలన, విజనరీ ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబును కేటీఆర్ పలు సందర్భాలలో ప్రశంసించారు.  

 KTR praises Chandrababu Naidu, Pattiseema Lift Irrigation Scheme, KTR Delhi interaction, AP water crisis management