కేసీఆర్ బాటలో జగన్ నడుస్తాడా?

 

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి బాజపాయేతర కూటమి అంటూ కాంగ్రెస్ తో చేతులు కలిపితే..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మాకు భాజపా,కాంగ్రెస్ రెండూ వద్దని ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయటానికి సన్నద్ధమయ్యారు. ఫ్రంట్‌ ఏర్పాటుపై ఇప్పటికే పశ్చిమ్‌బంగా సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కేసీఆర్‌ చర్చలు కూడా జరిపారు. ఇక ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ ఏపీ. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్‌ గెలవటం ఎంత ముఖ్యమో, ఏపీలో చంద్రబాబుని గద్దె దింపటం కూడా అంతే మఖ్యమైందిగా భావిస్తున్న కేసీఆర్.. ఫ్రంట్‌ లో భాగస్వామ్యం, ఏపీ రాజకీయాలపై ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ తో మంతనాలు జరపాలని నిశ్చయించుకున్నారు. ఆ భాద్యతను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి అప్పగించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌, వినోద్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి తదితరులు జగన్‌తో చర్చలు జరపనున్నారు. ఈరోజు హైదరాబాద్‌లోని జగన్ నివాసంలో మధ్యాహ్నం 12.30 గంటలకు సమావేశం జరగనుంది. దీంతో రాజకీయంగా తొలిసారి కేటీఆర్, జగన్‌తో చర్చలు జరపనుండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు యూపీఏ, ఎన్డీఏ కూటమిలో లేని జగన్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌తో కలిసివెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.