ముగిసిన భేటీ..కేసీఆర్ ని కలుస్తానన్న జగన్

 

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. హైదారాబాద్ లోని లోటస్ పాండ్ లో గల జగన్ నివాసం లో జరిగిన భేటీ అనంతరం ఉమ్మడిగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... ‘‘ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడాం. ఆయన సానుకూలంగా స్పందించడంతో వచ్చి వారి బృందాన్ని కలిసి అన్ని విషయాలను పంచుకున్నాం. తప్పకుండా ఒకే ఆలోచనాధోరణి ఉన్న నేతలందరూ ఒకే వేదికపై వస్తారని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉండే విధంగా జాతీయ రాజకీయాలు, రాజకీయ వ్యవస్థ ఉండాలన్న ఆలోచన ఉన్నవాళ్లు కలిసి వస్తారని మాకు విశ్వాసం ఉంది. ఇటీవల కేసీఆర్‌ ఏవిధంగానైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులతో చర్చించారో అదే విధంగా త్వరలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికీ వెళ్లి జగన్‌తో భేటీ అయి మిగిలిన విషయాలను మాట్లాడతారు. ప్రత్యేక హోదాకు సంబంధించి మా వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశాం. హోదాకు సంబంధించిన విషయంలో ఏపీకి మా పూర్తి మద్దతు ఉంటుంది" అని కేటీఆర్‌ పేర్కొన్నారు. దేశంలో గుణాత్మక మార్పుకోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అవసరమని అన్నారు.

అనంతరం జగన్ మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడిన తర్వాత తారక్‌ వచ్చి ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి నాతో చర్చించారు. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాల గురించి, అన్యాయం జరగకుండా రాష్ట్రాలు నిలబడాలంటే, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలవాల్సి ఉంది. ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీకే దిక్కు లేకుండా పోయింది. హోదా విషయంపై మేం ఎంత పోరాడినా కేంద్రంలో కదలిక లేదు. హోదా సాధనకు ఎంపీల సంఖ్య ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏపీకి చెందిన 25 ఎంపీలకు తోడుగా తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు కలిస్తే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. రాష్ట్రాల హక్కుల నిలబడాలంటే రాష్ట్రాల తరఫున మాట్లాడేవారి సంఖ్య పెరగాలి. రాష్ట్రాల ప్రయోజనాల కోసం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పుడు జరిగినవి ప్రాథమిక చర్చలు మాత్రమే. త్వరలోనే కేసీఆర్‌ కూడా వచ్చి కలుస్తామన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌పై మరింతగా చర్చిస్తామన్నారు. కేటీఆర్‌తో చర్చించిన అంశాలపై పార్టీలో విస్తృతంగా చర్చిస్తాం" అని తెలిపారు.