కేసీఆర్ చెప్పింది అబద్దమా? లేక కేటీఆర్ చెప్పింది అబద్దమా?

 

ఏపీ రాజధాని అమరావతి గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయననే ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. అసలే వైసీపీ ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతిని ఉంచుతుందా? లేదా? అని ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో.. ఏపీ రాజధాని అమరావతి వృధా పెట్టుబడి అంటూ కేసీఆర్ సంచలనం వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు అమరావతి కట్టకయ్యా, అదొక డెడ్ ఇన్వెస్టిమెంట్ అని చెప్పా.. కానీ వినలేదు, ఇప్పుడేమైంది? అంటూ కేసీఆర్ వ్యంగ్యంగా మాట్లాడారు. 

అయితే ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో గతంలో ఆయన కుమారుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుతెచ్చుకొంటున్నారు. గతంలో అమరావతికి రూ.100 కోట్లు ఇవ్వాలని కేసీఆర్ అనుకున్నారని స్వయంగా కేటీఆర్ మీడియా సాక్షిగా చెప్పారు. కొద్ది నెలల క్రితం జాతీయ మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. తమ సీఎం కేసీఆర్ ఏపీ కొత్త రాజధాని అమరావతికి రూ.100 కోట్లు ఇవ్వాలని అనుకున్నారని, అమరావతి భూమిపూజ నాడు ఆ మొత్తం ప్రకటించాలని భావించారని తెలిపారు. అయితే ప్రధాని మోదీ ఏం ప్రకటించకపోయేసరికి కేసీఆర్ కూడా వెనక్కితగ్గారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పూర్తి భిన్నంగా ఉండటంతో సోషల్ మీడియాలో కేసీఆర్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి 'డెడ్ ఇన్వెస్టిమెంట్' అంటున్న కేసీఆర్.. అసలు అమరావతికి రూ.100 కోట్లు ఇవ్వాలని ఎలా అనుకున్నారు? అంటే ఇప్పుడు కేసీఆర్ చెబుతున్న మాటలు అబద్దాలా? లేక అప్పుడు కేటీఆర్ చెప్పిన మాటలు అబద్దాలా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.