TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేటీఆర్‌ - హరీ‌ష్‌ మధ్య కోల్డ్ వార్‌? పార్టీలో పట్టు కోసం ఎత్తులు పైఎత్తులు

Published on: Mon Jun 12, 2017 3:21PM

 

కేసీఆర్‌ తర్వాత ఎవరు?... కొడుకు కేటీఆరా? మేనల్లుడు హరీష్‌రావా?... ఈ చర్చ ఎప్పట్నుంచో అటు పార్టీలోనూ...ఇటు ప్రభుత్వంలోనూ నడుస్తున్నా... మొగ్గు కేటీఆర్‌ వైపే ఉంటుందన్నది సహజంగా ఎవరైనా భావిస్తారు? అయితే కేసీఆర్‌ ఉద్యమం చేపట్టినాటి నుంచి ఆయన అడుగుల్లో అడుగేసి వెన్నంటే ఉన్న హరీష్‌రావు బలమేమీ తక్కువ కాదు... పార్టీ లీడర్లలోనూ కేడర్‌లోనూ హరీష్‌రావుకు విశేషమైన ఆదరణ ఉంది. అందుకే కేటీఆర్‌‌కు అటు పార్టీలో... ఇటు ప్రభుత్వంలో నెంబర్‌ టూ పొజీషన్‌ కట్టబెట్టేందుకు కేసీఆర్‌ వెనుకాడుతుంటారని టాక్‌. అంతేకాదు కేటీఆర్‌‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రకటించాలని కేసీఆర్‌కి ఉన్నా... హరీష్‌ భయంతోనే వెనకడువేస్తున్నారనే ప్రచారమూ ఉంది. అయితే సమర్ధత విషయంలో కేటీఆర్‌‌, హరీష్‌రావూ ఇద్దరూ సమర్ధులే. కానీ కేసీఆర్‌ ఉద్యమం చేపట్టిన నాటి నుంచి ప్రజల్లో ఉండటంతో... టీఆర్‌ఎస్‌ లీడర్లు, కేడర్‌లో హరీష్‌రావుకే పట్టు ఎక్కువగా ఉంది. దీన్ని బ్రేక్‌ చేసేందుకు కేటీఆర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలో హరీష్‌రావుపై దాదాపు పైచేయి సాధిస్తూనే... అటు పార్టీలోనూ తన పట్టు పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు కేటీఆర్‌.

 

ముఖ్యంగా పార్టీ, నామినేటెడ్ పదవుల్లో కేటీఆర్ మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నడూ లేనివిధంగా పదవుల పంపకంలో కేటీఆర్‌ అనుచరులకు అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ఇటు నామినేటెడ్, అటు పార్టీ పదవులు రెండింటిలోనూ ఆయన అనుచరులకే పెద్ద పీట దక్కుతోంది. పార్టీ అనుబంధ సంఘాల నియామకాలే పార్టీలో పెరుగుతున్న కేటీఆర్ హవాకు సంకేతమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ యువజన విభాగం అధ్యక్ష బాధ్యతలను తన శిష్యుడు... MLC శంబుపూరి రాజుకి కట్టబెట్టారు. విద్యార్ధి విభాగపు అధ్యక్షుడిగా నియమితులైన గెల్లు శ్రీనివాస్ యాదవ్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన రాకేష్ కూడా కేటీఆర్ అనుయాయులే.. తెలంగాణ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన బాలమల్లు కూడా కేటీఆర్ వర్గీయుడే. వీరే గాక... గ్రంధాలయ ఛైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీలో కేటీఆర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది.

 

ఇక జిల్లా కన్వీనర్లు, పార్టీ కార్యవర్గంలో తన అనుచరులకు అధిక ప్రాధన్యత దక్కేలా కేటీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో పార్టీ పదవుల విషయం అంతగా పట్టించుకోని కేటీఆర్‌...పార్టీపై పట్టు బిగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాంతో సచివాలయంలోని కేటీఆర్‌ ఛాంబర్, నందినగర్‌లో ఆయన క్యాంప్ కార్యాలయం కిటకిటలాడుతోంది. పదవుల కోసం నేతలు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. కేటీఆర్ కూడా కీలక జిల్లాల బాధ్యతలు తన అనుచరులకే కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే చాలా జిల్లాల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. అందుకే పార్టీ పదవుల భర్తీ ఆలస్యమవుతుందనే చర్చ పార్టీలో సాగుతోంది. అయితే ఏకాభిప్రాయం కుదరకపోవడానికి హరీష్‌రావే కారణమనే టాక్‌ వినిపిస్తోంది.