నాతో ఉంటే దేశ భక్తుడివి లేకపోతే దేశ ద్రోహివి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

 

దేశంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని.. విభేదించే పరిస్థితి లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ వికాస సమితి మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత రాజకీయాలపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఒక మతాన్ని వ్యతిరేకించడం లేదా అతిగా ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నారు. జాతిపితను గౌరవించుకోలేని పరిస్థితికి దేశం దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.

దేశంలో మతం, జాతీయవాదం పెనవేసుకుపోయాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ‘నాతో ఉంటే దేశ భక్తుడివి లేకపోతే దేశ ద్రోహివి’ అన్న పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. నాథురామ్ గాడ్సే దేశభక్తుడంటూ సాద్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యల్ని తాను సోషల్‌ మీడియాలో ఖండించినట్టు ఈ సందర్భంగా కేటీఆర్‌ గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ తనకు ట్విటర్‌లో కామెంట్‌ రావడం ఎంతో బాధ కలిగిందని కేటీఆర్‌ చెప్పారు.