TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేటీఆర్ 2009 ఎన్నికల అఫిడవిట్ వివరాలివీ.. ఆస్తుల విలువెంతంటే?

Published on: Fri Sep 18, 2026 2:28PM

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కేటీఆర్ కుటుంబ ఆస్తులపై వాడి వేడి చర్చ జరుగుతోంది.   ఈ నేపధ్యంలో గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు.. గతంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లు, నాటి ఆస్తుల వివరాలు   తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఆయన రాజకీయ ప్రవేశం ప్రారంభ దశలో..  అంటే 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అధికారిక ఎన్నికల అఫిడవిట్ లోని గణాంకాలు ఇప్పుడు  ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

నాటి అఫిడవిట్ ప్రకారం కేటీఆర్,  ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న చరాస్తులు, స్థిరాస్తుల లెక్కలు అప్పట్లో   సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. 2009 ఎన్నికల్లో సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన సందర్భంగా కేటీఆర్ సమర్పించిన అఫిడవిట్  ప్రకారం, ఆయన స్వయంగా కేవలం ఒక ఎకరం వ్యవసాయ భూమిని మాత్రమే కలిగి ఉన్నారు. రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం దేవరయంజాల్ సర్వే నంబర్ 437 పరిధిలో ఉన్న ఆ ఒక్క ఎకరం వ్యవసాయ భూమి విలువ నాటి అఫిడవిట్ లో  50 వేల రూపాయలుగా ఉంది.   అలాగే..  ఆయన సతీమణి పేరిట అప్పట్లో ఆల్వాల్ ప్రాంతంలో 660,  534 చదరపు గజాల స్థలాలు, మొయినాబాద్‌లో 400 చదరపు గజాల ప్లాట్, ఇంకా  కొండాపూర్ ప్రాంతంలో ఒక ఫ్లాట్ ఉన్నాయి. 

అప్పట్లో కేటీఆర్ కుటుంబం మొత్తం ప్రకటించిన స్థిరాస్తుల విలువ సుమారు రూ. 2.59 కోట్లుగా ఉండగా, కేవలం వ్యక్తిగతంగా చూస్తే రూ. 1.40 కోట్ల స్థిరాస్తులు మాత్రమే అఫిడవిట్ లో చూపించారు. చరాస్తుల విషయానికి వస్తే, కేటీఆర్ తన అఫిడవిట్‌లో రూ. 72 లక్షల పాతిక వేల రూపాయల విలువైన చరాస్తులను, అలాగే ఆయన సతీమణి పేరిట  96 లక్షల 42 వేల రూపాయల విలువైన చరాస్తులను ప్రకటించారు.  

అప్పట్లో  కేటీఆర్ బ్యాంకుల నుండి ఇళ్లు  కార్ల కొనుగోలు నిమిత్తం   57 లక్షల 49 వేల 501 రూపాయల అప్పులు ఉన్నట్లు అప్పటి ఆయన అఫిడవిట్ ప్రకారం తెలుస్తోంది.  సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం నాటి ఈ ఆర్థిక స్థితిగతులకు, ఆ తర్వాత కాలక్రమేణా పార్టీ అధికారంలోకి వచ్చాక, అలాగే  వివిధ వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణ తర్వాత పెరిగిన ఇప్పుడున్న ఆస్తుల వివరాలకు మధ్య ఉన్న వ్యత్యాసాలపై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. నాటి సాధారణ ఆర్థిక ప్రొఫైల్ నుండి నేడు రూ. 50 కోట్లకు పైగా ప్రకటించిన ప్రస్తుత ఆస్తుల స్థాయికి ప్రయాణించిన కేటీఆర్ రాజకీయ, ఆర్థిక ప్రయాణం నేపథ్యంలో  ఈ పాత అఫిడవిట్ పత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 


[KTR Assets, 2009 Election Affidavit, KTR Family Property, Telangana Politics, BRS party, KTR declared assets, Telugu One]