TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రి కారు అడ్డ‌గింపు.. అభినందించిన కేటీఆర్‌..

Published on: Mon Oct 4, 2021 4:21PM

అస‌లే అది మంత్రి కేటీఆర్ కారు. ఆ కారు వ‌స్తుందంటే.. మిగ‌తా వాహ‌నాల‌న్నిటినీ ఆపేసి.. రూట్ క్లియ‌ర్ చేయ‌డ‌మే ట్రాఫిక్ పోలీసుల ప‌ని. కానీ, ఆ ఇద్ద‌రు పోలీసులు మాత్రం అలా చేయ‌లేదు. మంత్రి కారైతే ఏంటంటూ.. ఏమాత్రం భ‌య‌ప‌డ‌కుండా రాంగ్‌రూట్‌లో వ‌స్తున్న కేటీఆర్ కారును ఆపేశారు. అక్క‌డే ఉన్న టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు గొడ‌వ ప‌డినా బెద‌ర‌కుండా మంత్రి కారుకు ఫైన్ వేసి.. రాంగ్‌రూట్ నుంచి వెన‌క్కి పంపించేశారు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాకు ఎక్క‌డంతో అక్క‌డ ర‌చ్చ ర‌చ్చ అవుతోంది. రాంగ్‌రూట్‌లో  మంత్రి కారు రావ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ నెటిజ‌న్లు కామెంట్ల‌తో కుమ్మేస్తున్నారు. సిన్సియ‌ర్‌గా డ్యూటీ చేసిన‌ ట్రాఫిక్ పోలీసుల‌ను అభినందిస్తున్నారు. 

ఈ విష‌యం తెలిసి మంత్రి కేటీఆర్ సైతం ఆ ట్రాఫిక్ పోలీసుల‌ను అభినందించారు. రాంగ్‌రూట్‌లో వస్తున్న తన కారును అడ్డుకున్న ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్యను, కానిస్టేబుల్ వెంక‌టేశ్వ‌ర్ల‌ను మంత్రి కేటీఆర్ ప్ర‌సంశించారు. నిబంధనల ప్రకారం పని చేసిన ట్రాఫిక్ సిబ్బందిని తన కార్యాలయానికి పిలిపించుకున్న మంత్రి కేటీఆర్.. వారిని శాలువాల‌తో స‌న్మానించారు. 

నిబంధనలు ప్రజలకైనా, ప్రజా ప్రతినిధులకైనా ఒకటే అని మంత్రి కేటీఆర్ అన్నారు. నిబంధనల ప్రకారం పని చేసే ఐలయ్య లాంటి అధికారులకు తామెప్పుడూ అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ఎప్పుడూ ముందు ఉంటానని, చలాన్ విధించిన రోజున తాను ఆ వాహనంలో లేనని కేటీఆర్ చెప్పారు. గాంధీ జయంతి రోజున బాపూ ఘాట్ ద‌గ్గ‌ర‌ అనుకోని పరిస్థితుల్లో రాంగ్ రూట్‌లో వచ్చిన తన వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. తన కారుకు విధించిన చలాన్‌ను చెల్లించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

గాంధీ జయంతి సందర్భంగా శనివారం బాపూఘాట్‌ వద్ద మంత్రి కేటీఆర్ నివాళులర్పించేందుకు వెళ్లినప్పుడు ఆయన కారును ట్రాఫిక్ ఎస్‌ఐ అడ్డుకున్న విషయం తెలిసిందే. రాంగ్‌రూట్‌లో మంత్రి కారు రావడంతో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఐలయ్య అడ్డుకున్నారు. రాంగ్‌ రూట్‌లో ఎందుకొస్తున్నావు? వెనక్కి వెళ్లు అని డ్రైవర్‌కు సూచించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడంతో ట్రాఫిక్ సిబ్బందిని అభినందించి మంత్రి కేటీఆర్ తన నిజాయితీని నిరూపించుకున్నారు.