కాటమరాయుడు... కేటీఆర్ కి ఎందుకు నచ్చాడు?


ఆ మధ్య ఎన్నికల కోలాహలంలో కేసీఆర్ పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నారో గుర్తుందా? పండగల సమయంలో గంగిరెద్దుల వాళ్లు వస్తుంటారు! పవన్ కూడా అంతే అన్నారు! అప్పట్లో కేసీఆర్ ఫ్యాన్స్ ఆహా ఓహో అంటూ సమర్థిస్తే పవన్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. కాని, సీన్ కట్ చేస్తే,  2014 నుంచి 2017లోకి వచ్చే సరికి... మొత్తమంతా మారిపోయింది! అప్పట్లో ఎవర్నైతే గంగిరెద్దుల వారు అన్నారో... ఆ సినిమా హీరో కొత్త సినిమాకే కేటీఆర్ వెళ్లారు! కాటమరాయుడు సూపర్ అంటూ సర్టిఫికెట్ ఇచ్చారు! అంతే కాదు, ట్విట్టర్ లో పవన్, కేటీఆర్ ల ఫోటో కూడా హల్ చల్ చేసింది! మరి ఈ కేటీఆర్ కాటమరాయుడి కొత్త క్లోజ్ నెస్ ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు?

 

చాలా సింపుల్ గా పైపైన కనిపించేదే డిస్కస్ చేసుకుంటే ... కేటీఆర్ కాటమరాయుడు చూడటానికి కారణం... చేనేతకు చేయూతనివ్వటమే! పంచె కట్టి పంచ్ డైలాగ్ లు చెప్పిన కాటమరాయుడు బాగానే చేనేత వస్త్రాలకి ప్రొత్సాహం ఇచ్చాడు. సినిమాలోనే కాదు నిజంగా కూడా తనని కలవటానికి వచ్చిన చేనేత సంఘాలతో తాను బ్రాండ్ అంబాసిడర్ గా వుంటానని హామీ ఇచ్చాడు. అదే విషయాన్ని తన ట్వీట్ లో కేటీఆర్ చెప్పారు కూడా! సినిమా బాగుంది. సినిమాతో పాటూ పవన్ చేనేతకు అందించిన మద్దతు ఇంకా బావుందని అన్నారు! కాని, దీని వెనుక చేనేతే తప్ప రాజకీయ చేయూత ఏం లేదంటారా?

 

కేటీఆర్ పవన్ కలిసి ఫోటో దిగేదాకా రిలేషన్ రావటం మామూలు విషయం కాదు. గత ఎన్నికల్లో జనసేనాని మోదీ, చంద్రబాబుల టీమ్. కేసీఆర్ కి, కేటీఆర్ కి యాంటీ! అందుకే, బాగానే మాటల దాడి చేశారు. మరి ఇప్పుడు పరిస్థితేంటి? పవన్ అనంతపురం నుంచీ పోటీ చేస్తూ దృష్టంతా ఆంధ్రా మీదే పెట్టినా... తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుందని చెప్పనే చెప్పాడు. అలా చూస్తే టీఆర్ఎస్ పవన్ పై దాడిని పెంచాలి. కాని, అనూహ్యంగా కాటమరాయుడు కలెక్షన్స్ పెంచే మాటలు చెప్పారు కేటీఆర్! అదే ఇక్కడ ట్విస్ట్!

 

రాజకీయ విమర్శకుల అభిప్రాయం ప్రకారం... వచ్చే ఎన్నికల్లో పవన్ ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపికి వ్యతిరేకంగానే పోటీ చేసే ఛాన్సెస్  వున్నాయి.అయితే, అలా చేస్తే ఏపీలో టీడీపీ లాభపడే సూచనలున్నాయని కూడా వారంటున్నారు! ఎందుకంటే, పవన్ ఎంట్రీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి జగన్ మరోసారి సీఎం కుర్చీకి దూరమైనా ఆశ్చర్యం లేదంటున్నారు! మరి అదే ఫార్ములా టీఎస్ లో ఎందుకు అప్లై కాదు? జనసేన ఫుల్ జోష్ తో బరిలోకి దూకితే... టీఆర్ఎస్ కు నష్టం కలిగించాల్సిన ప్రభుత్వ వ్యతిరేకత తగ్గదంటారా? టీకాంగ్ కు, టీబీజేపికి పడాల్సిన ఓట్లు పవన్ కారణంగా చీలిపోయి టీఆర్ఎస్ కు మేలు జరగదంటారా? ఇవీ ఇప్పుడు కొందరి ప్రశ్నలు!

 

పవన్ వల్ల నెక్స్ట్ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ కు లాభమా? తాజాగా జరిగిన యూపీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం చూశాక ఇండియన్ ఎలక్షన్స్ లో ఏమైనా జరగవచ్చనే విషయం తేలిపోయింది! సో... కాటమరాయుడు ఎఫెక్ట్ కూడా మనం ఇప్పుడే చెప్పలేం! ఆయన మీద ఏదో ఆశతోనే కేటీఆర్ సినిమా చూసి, ఫోటోకి ఫోజ్ ఇచ్చాడని కూడా చెప్పలేం. కాకపోతే, ఇంతకాలం పవన్ పేరు చెబితే చిరచిరలాడిన గులాబీ నేతలు ఇక మీద అంతగా ఇరిటేట్ కాకపోవచ్చని మాత్రం చెప్పవచ్చు!