అన్నా.. తమ్ముడు అనుకుంటూనే చినబాబుల పోరు..
Published on: Sat Jan 30, 2016 10:32AM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకప్పుడు ఒకరి మీద ఒకరు విమర్సల బాణాలు వేసుకుంటూ ఉండేవారు. అయితే తరువాత పరిస్థితులు మారడంతో ఇద్దరు సీఎం లు ఇప్పుడు సన్నిహితంగా ఉంటూ.. దాదాపు విమర్శలకు దూరంగానే ఉంటున్నారు. అయితే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు సీఎంల తనయులు మాత్రం అన్నా.. తమ్ముడు అనుకుంటూనే పోటా పోటీగ విమర్శలు చేసుకుంటున్నారు.
నిన్న మొన్నటి వరకూ అనసూయ అనే మహిళ మీద ట్విట్టర్ వార్ జరిగింది. ఇప్పుడు మరో అంశం మీద ఇద్దరు కౌంటర్లు వేసుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో ప్రచారం చేస్తున్న లోకేశ్ ను ఉద్దేశించి కేటీఆర్.. లోకేశ్ గెస్ట్ లాంటి వాడు అని అభివర్ణించాడు. దీనికి లోకేశ్ సైలెంట్ గా ఉంటాడా.. కేటీఆర్ కు ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. హైదరాబాద్ గల్లీల్లో తిరిగి పెద్ద అయిన తనకు.. గుంటూరులో చదువుకున్న కేటీఆర్ గెస్ట్ అనటమేమిటంటూ కౌంటర్ వేశారు. మళ్లీ దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘మా తమ్ముడు లోకేశ్.. ఆంధ్రాలో ముఖ్యమంత్రి కావటానికి ప్రయత్నిస్తాడా? లేక తెలంగాణ నుంచి పోటీ చేస్తాడా? ఆ విషయం ముందు చెప్పమనండి’’ అంటూ లోకేశ్ ను ఇరుకున పెట్టే ప్రశ్న సంధించాడు. మరి దీనికి లోకేశ్ ఎలా సమాధానం చెబుతాడో వెయిట్ చేద్దాం.


