అవి మట్టి బొమ్మలు మాత్రమే: కేటీఆర్

 

ఈరోజు శాసనసభ సమావేశంలో ట్యాంక్ బండ్ పై విగ్రహాల కూల్చివేతపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. తెరాస నేత కె.తారక రామారావు సభలో ప్రసంగిస్తూ, వేయి మంది విద్యార్ధులు చనిపోతే కనీసం పరామార్శించని సీమాంధ్ర నేతలు మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బ్యాండ్ పై నాలుగు మట్టి బొమ్మలు పగిలితే ఏదో అపచారం జరిగిపోయినట్లు గగ్గోలు పెడుతున్నారని అనడంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

 

కాంగ్రెస్, తెదేపా నేతలతో బాటు గండ్ర వెంకటరమణ వంటి కొందరు టీ-కాంగ్రెస్ నేతలు సైతం కేటీఆర్ మాటలు అహంకారపూరితంగా ఉన్నాయని,వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా బలవంతంగా, కుట్రపూరితంగా కలపబడిందన్న కేటీఆర్ వ్యాక్యలను డొక్కా మాణిక్యవర ప్రసాద్ వంటి సీమాంధ్ర నేతలు తీవ్రంగా ఖండించారు. కానీ, కేటీఆర్ మాత్రం తను మాట్లాడిన మాటలలో ఎటువంటి తప్పులేదని, నూటికి నూరు శాతం అది నిజమని, దానికే తను కట్టుబడి ఉంటానని వాదించడంతో సభలో మరింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో సభ కొంతసేపు వాయిదాపడింది.

 

మళ్ళీ సమావేశమయినప్పుడు ఈసారి తెరాస నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, సీమాంధ్ర నేతలు చివరికి ట్యాంక్ బండ్ పై ఒక్క తెలంగాణా నేత విగ్రహం కూడా పెట్టకపోవడం గమనిస్తే తెలంగాణా ఎంత వివక్షకు గురవుతోందో అర్ధమవుతుందని అన్నారు. తెదేపా నేత నరేంద్ర ఆయన మాటలకు జవాబు చెపుతూ, ట్యాంక్ బండ్ పై ఉన్న రాణీ రుద్రమదేవి, భక్త రామదాసు, మక్దూం మోయుద్దీన్ తదితరులు తెలంగాణా ప్రాంతానికి చెందివారు కాదా? అని ప్రశ్నించారు. ప్రముఖ కవి మరియు అచ్చమయిన తెలంగాణా వ్యక్తి సినారె విగ్రహాల స్థాపన కమిటికీ అధ్యక్షుడని, ఆ కమిటీలో తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఒక సభ్యుడని గుర్తుచేసి, మరి ఆయన ఏనాడు కూడా తెలంగాణా ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. మహనీయుల విగ్రహాలను మట్టి బొమ్మలనే తెరాస నేతలు ముందుగా సంస్కారం నేర్చుకోవాలని తెదేపా, కాంగ్రెస్ నేతలు హితవు పలికారు.

 

మంచి మాటకారి అయిన కేటీఆర్, నేర్పుగా చర్చను పక్కదారి పట్టిస్తూ, బ్రతికి ఉన్న మనుషులకు సమాధులు కట్టే కాంగ్రెస్ వారి నుండి, స్వర్గీయ యన్టీఆర్ పై చెప్పులు విసిరించిన తెదేపా నేతల నుండి తాము సంస్కారం నేర్చుకోవలసిన అవసరం లేదని, ముందుగా వారే నేర్చుకొని సభకు క్షమాపణ చెపితే బాగుంటుందని జవాబీయడంతో, కాంగ్రెస్, సీమాంధ్ర సభ్యులు కేటీఆర్, తెరాసకు వ్యతిరేఖంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. అయితే కేటీఆర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. మంద బలమతో తమ గొంతు నోక్కేయలేరని అనడంతో సభలో గందరగోళం మొదలయింది.