TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిమిషం కూడా అధికారంలో ఉండే అర్హతలేదు బాబు

Published on: Mon Jan 2, 2012 8:35AM

హైదరాబాద్: కృష్ణా జిల్లాలో కల్తీ సారాకు 14 మంది ప్రాణాలు కోల్పోయి 24 గంటలు గడుస్తున్నా ఒక్క మంత్రి లేదా ప్రభుత్వ అధికారి ఒక్కరూ కూడా వెళ్లక పోవడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.అయన  హైదరాబాద్‌లో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఈ  కల్తీ సారా ఘటనతో ఈ ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండే అర్హతలేదన్నారు. విచ్చలవిడి మద్యం అమ్మకాలతో వచ్చే సొమ్ముతో సంక్షేమ పథకాలు అమలు చేయమని ఎవరు కోరుతున్నారని  ప్రశ్నించారు. మద్యం నుంచి ప్రభుత్వానికి ఆదాయం రావాలని, మంత్రులకు కిక్ బాక్స్ రావాలని, అదే ఈ ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ఈ ప్రభుత్వం సిగ్గులేకుండా మద్యం వ్యాపారాన్ని సమర్ధించుకుంటోందని దుయ్యబట్టారు.

 మద్యం సిండికేట్లపై తక్షణం ఏసీబీ నివేదిక బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యం సిండికేట్ల అక్రమాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.కృష్ణా జిల్లాలో చోటు చేసుకున్న కల్తీ సారా ఘటనకు పూర్తిగా ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలన్నారు. అవినీతి ప్రభుత్వం చేతకానితనం వల్లే పేదలు కల్తీసారకు బలయ్యారన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నా కిరణ్ ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. కాంగ్రెస్ ఎక్సైజ్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.