TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొండలను మింగేస్తున్న గ్రావెల్ దొంగలు

Published on: Mon Feb 13, 2012 3:47PM

బడా కాంట్రాక్టర్లుకు అమాత్యుని అభయహస్తం
కృష్ణాజిల్లా: కృష్ణాజిల్లా నూజివీడు రెవిన్యూ డివిజన్ పరిధిలో ఎర్రమట్టితో కూడిన అనేక కొండలున్నాయి. అయితే ఈ కొండలు రాత్రికి రాత్రే తమ స్వరూపాలను మార్చుకొంటున్నాయి. కొద్దిరోజుల తరువాత ఆచూకీ మాయమైపోతున్నాయి. కొందరు బడా బాబులు రాత్రి వేళల్లో అటవీ ప్రాంతాల్లో మారుమూల వున్న కొండల వద్ద ప్రొక్లెయినర్లు, ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని తెల్లవారే సరికి గుట్టుచప్పుడుకాకుండా గ్రావెల్ తవ్వెస్తున్నారు. అలా ఇప్పటికే కోట్లాదిరూపాయల విలువైన గ్రావెల్ అక్రమార్కుల జేబులు నింపడానికి దోహదపడింది. వీరికి జిల్లాలోని ఒక అమాత్యుని అండదండలున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రెవెన్యూ, అటవీ, మైనింగ్ శాఖల అధికారులు, ఉద్యోగులు ఈ  అక్రమ గ్రావెల్ తవ్వకాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఈ అక్రమ ఆదాయంలో కొన్నిచోట్ల వీరికి కూడా వాటాలు అందుతున్నట్లు తెలిసింది. పత్రికల్లో ఎప్పుడైనా ఒకటి అరా వార్తలు వస్తే ఈ శాఖల అధికారులు హడావిడి చేస్తున్నారు. ఒకటో రెండో వాహనాలను సీజ్ చేస్తున్నారు. అయితే రాత్రి వేళల్లో గ్రావెల్ తవ్వకాలు మాత్రం నిరాటంకంగా సాగిపోతూనే ఉన్నాయి. అక్రమ గ్రావెల్ తవ్వకాలను అరికట్టేందుకు గతంలో జాయింట్ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి క్వారీలపై కొంత సమాచారం సేకరించారు. అయితే ఈ అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు.