కౌలు రైతుల భరోసా యాత్ర.. జనసేనాని రూ.5 కోట్ల ఆర్థికసాయం!
Published on: Tue Apr 12, 2022 11:47AM
పవన్ కల్యాణ్ ప్రజాబాట పట్టారు. కౌలు రైతులకు అండగా నిలుస్తున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాక.. అప్పుల ఊబిలో చిక్కుకుపోయి.. కష్టాలతో సతమతమై.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను జనసేనాని పరామర్శిస్తున్నారు. కేవలం ఓదార్పుకే పరిమితం కాకుండా.. ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష ఆర్థిక సాయం అందజేస్తున్నారు. తన వంతుగా రూ.5 కోట్ల మేర సాయం అందించేందుకు సిద్ధమయ్యారు పవన్ కల్యాణ్.
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌలు రైతుల భరోసా యాత్ర ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు సాకే రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని భార్య సుజాతకు రూ.లక్ష ఆర్థికసాయం అందించారు. తన భర్త చనిపోయిన తర్వాత ప్రభుత్వం తరఫున ఎలాంటి సాయమూ అందలేదని.. ఎవరూ పట్టించుకోలేదని.. జనసేనానితో ఆవేదన వ్యక్తం చేశారు సుజాత. పార్టీ తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని పవన్ ఆమెకు హామీ ఇచ్చారు.
ధర్మవరం మండలంలోని గొట్లూరు, అనంతపురం రూరల్ మండలం పూలకుంట, మన్నీల గ్రామాల్లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు.
ఏయే జిల్లాల్లో ఎంత మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే వివరాలను జనసేనికులు ప్రభుత్వం నుంచి సమాచార హక్కు చట్టం కింద సేకరించారు. ఆ జాబితా ప్రకారం ఆయా జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పవన్ కలుసుకోనున్నారు.
ఇవాళ శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని కౌలు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించి ఆర్థికసాయం చేస్తున్నారు. సాయంత్రం మన్నీల గ్రామంలో పవన్ రచ్చబండ నిర్వహించనున్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఎంతో కొంత సాయం చేయాలనే తలంపుతో.. రూ.5 కోట్లు పార్టీకి విరాళంగా ప్రకటించారు జనసేనాని.


