వైకాపా యంపీ కొత్తపల్లి గీతకు కోర్టు సమన్లు

 

అరకు వైకాపా యంపీ కొత్తపల్లి గీత గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ తెదేపా-బీజేపీ నేతలతో కలిసి తిరుగుతున్నారు. తనను గౌరవించని వైకాపాలో తను ఇమడలేనని ఇకపై తెదేపా-బీజేపీలతోనే కలిసి పనిచేస్తానని ఆమె ప్రకటించారు.

 

అప్పుడు ఆమె నియోజక వర్గానికే చెందిన పార్టీ యం.యల్యే. ఈశ్వరి ఆమె తాను దళిత కులానికి చెందిన వ్యక్తినని రిటర్నింగ్ అధికారికి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని ఆరోపణలు చేసారు. దానిపై యంపీ గీత స్పందిస్తూ “నాకు పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు పార్టీ అధిష్టానం అవేవి చూడకుండానే టికెట్ ఇచ్చిందా? నేను యస్సీనని దృవీకరించుకొన్న తరువాతనే పార్టీ నాకు టికెట్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఆ విషయంపై ప్రశ్నించడం అంటే పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని తప్పుపట్టినట్లే కనుక ఈశ్వరి నన్ను ప్రశ్నిస్తున్నారా లేక పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారా?” అని ఎదురు ప్రశ్నించి ఆమె నోరు మూయించగలిగారు.

 

అయితే కొత్తపల్లి గీతపై పోటీ చేసి ఓడిపోయిన తెదేపా నేత సంద్యారాణి ఆమె ఎన్నికలలో పోటీ చేసేందుకు తప్పుడు కుల దృవీకరణ పత్రాలు సమర్పించారంటూ ఆమెపై హైకోర్టులో ఒక పిటిషను వేసారు. అయితే అప్పుడు కొత్తపల్లి గీత తెదేపాలోకి వచ్చి చేరుతుందని ఊహించకపోవడంతో ఇప్పుడు హైకోర్టు ఆమె వేసిన ఆ పిటిషను విచారణకు చెప్పట్టి ఆమెను ఈ నెల 31న కోర్టు విచారణకు హాజరు కమ్మంటూ నోటీసులు జారీ చేయడంతో తెదేపాకు కొంచెం ఇబ్బందికరం పరిస్థితి ఎదురయింది.

 

అది చూసి వైకాపా చాలా సంతోషపడిపోతోంది. అయితే నేటికీ కొత్తపల్లి గీతను తెదేపాలో చేర్చుకోకపోవడంతో ఆమె నేటికీ వైకాపా యంపీగానే పరిగణింపబడతారు. అయితే ఆవిషయం పట్టించుకోకుండా వైకాపా చంకలు కొట్టుకొని తెగ ఆనందపడిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ గీత కనుక ఈ వ్యవహారంలో దోషిగా తేలితే అందుకు వైకాపాయే బాధ్యత వహించాల్సి ఉంటుంది తప్ప తెదేపా కాదనే సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.