జగన్ సాక్షిగా అంటూ ప్రమాణం చేసిన వైసీపీ ఎమ్మెల్యే!!
Published on: Wed Jun 12, 2019 6:14PM

సినిమా హీరోలను కొందరు అభిమానులు దైవంగా భావించడం చూస్తుంటాం. అదేవిధంగా పార్టీ అధినేతలను ఆయా పార్టీ కార్యకర్తలు, నేతలు కొందరు దైవంగా భావిస్తుంటారు. బయటివారికి అది కాస్త ఓవర్ గా అనిపించినా.. వారు మాత్రం మా నాయకుడు మాకు దైవంతో సమానం.. అసలు నా జీవితం ఆయనకే అంకితం లాంటి బలమైన డైలాగులు చెబుతుంటారు. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఏపీ అసెంబ్లీలో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది.
ఈరోజు అసెంబ్లీ సమావేశాలలో.. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు ప్రమాణస్వీకారం చేయించిన విషయం తెలిసిందే. అయితే.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పుడు దైవసాక్షిగా అనడానికి బదులు జగన్ సాక్షిగా అంటూ ప్రమాణం చేసారు. అంటే ఆయన వారి పార్టీ అధినేతను దేవుడితో పోల్చారన్నమాట. అయినా ఈ ఆరాధనలు, అభిమానాలు బయట కుదురుతాయి కానీ.. ఇక్కడ కాదు కదా. అందుకే ఈ ప్రమాణం చెల్లదంటూ ఆయనతో ప్రొటెం స్పీకర్ రెండోసారి ప్రమాణస్వీకారం చేయించారు. మొత్తానికి కోటంరెడ్డి జగన్ సాక్షిగా అంటూ ప్రమాణం చేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు. అలాగే సీఎం జగన్ దృష్టిలో మరింత పడ్డారు.


