రుణమాఫీపై కోటయ్య కమిటీ నివేదిక సమర్పణ!

 

రైతుల రుణమాఫీ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోటయ్య కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందజేసింది. బ్యాంకుల నుంచి కమిటీకి పూర్తి సమాచారం అందకపోయినప్పటికీ అందుబాటులో వున్న వివరాలతో కోటయ్య కమిటీ నివేదికను పూర్తి చేసి చంద్రబాబు నాయుడికి అందించింది. మంగళవారం నాడు కోటయ్య కమిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించాల్సి వుంది. ఒకరోజు ముందే సోమవారం నాడు నివేదిక అందజేసింది. నివేదిక సమర్పించడానికి కమిటీ 45 రోజుల సమయాన్ని తీసుకుంది. రైతులు తీసుకున్న రుణాల విలువ రూ.72 వేల కోట్లు కాగా, ఇందులో వ్యవసాయ రుణాలు రూ.62వేల కోట్లు, డ్వాక్రా, చేనేత రుణాలు రూ.12వేల కోట్లు, బంగారంపై రుణాలు రూ.34వేల కోట్లు, పంటరుణాలు రూ. 26వేల కోట్లుగా కోటయ్య కమిటీ తెలిపింది. రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలను కమిటీ ఈ నివేదికలో పొందుపరిచింది. పంట రుణమైతే లక్షన్నర, బంగారం రుణమైతే 50 వేలు మాఫీ చేయాలని, రుణమాఫీ కోసం ఎర్రచందనం నిల్వల అమ్మమ్మకం, బాండ్లు జారీ చేయడం ద్వారా డబ్బు సమకూర్చుకోవాలని కమిటీ సూచించింది. కుటుంబానికి ఒక్క రుణాన్ని మాఫీ చేయాలని కోటయ్య కమిటీ సిఫారసు చేసినట్టు తెలుస్తోంది.