కొండపోచమ్మ కాల్వకు గండి.. నీట మునిగిన పొలాలు

కొండపోచమ్మ జలాశయం కాల్వకు ఈ ఉదయం గండి పడింది. ఇటీవలే కొండపోచమ్మ జలాశయం నుంచి ఆలేరు నియోజకవర్గానికి నీరు విడుదల చేశారు. ఈక్రమంలో ఈరోజు ఉదయం 7గంటలకు సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండల శివారు వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్‌ కుడి కాలువకు గండి పడింది. దీంతో గ్రామంలోకి భారీగా వరదనీరు ప్రవహించింది. పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో కాలువకు నీటివిడుదల నిలిపివేశారు. ఉదయం పూట కావడంతో ప్రమాదం తప్పిందని, అదే రాత్రివేళ అయితే పెను నష్టం జరిగి ఉండేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.