కాంగ్రెస్ గూటికి కొండా దంపతులు

 

తెలంగాణపై వైకాపా ‘యూ’ టర్న్ తీసుకొన్నందున ఆగ్రహించి బయటకి వచ్చిన అనేక నేతలలో కొండా సురేఖ దంపతులు కూడా ఒకరు. వైకాపాను వీడినప్పటి నుండి వారు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు నేటికి ఫలించాయి. వారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ సమక్షంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 

తమ కార్యకర్తల, తెలంగాణా ప్రజల అభిమతం మేరకు తాము కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వారు మీడియాకు తెలిపారు. ఇదివరకులాగే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ త్వరలో తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ పూర్తిచేస్తుందని తాము విశ్వసిస్తున్నామని వారు అన్నారు.

 

వారిరువురు సమైక్యవాదం గట్టిగా వినిపిస్తున్నకిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే పార్టీలో చేరవలసిరావడం విచిత్రం. ఆయన తన ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా చేస్తున్నవాదనలలో తమకు తప్పేమీ కనబడటం లేదని చెప్పడం విశేషం.

 

గతంలో వారు కాంగ్రెస్ పార్టీని వీడి వైకాపాలో చేరిన తరువాత, కాంగ్రెస్ పార్టీకి చెందిన చిన్న పెద్ద నేతలను నోరారా తిట్టిపోశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసిన నోటితోనే, మళ్ళీ వైకాపాను వీడగానే జగన్మోహన్ రెడ్డికి డబ్బు యావ ఎక్కువని, వైకాపాకు అధికారా లాలస కోసమే నాటకాలు ఆడుతోందని వారి విమర్శించారు. ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ గూటిలోకి వచ్చిపడ్డ వారిరువురూ ప్రస్తుతం ఆయన వాదనలో తప్పేమీ లేదని చెప్పవచ్చును. కానీ రేపు మళ్ళీ ఆయన సమైక్యవాదం వినిపించినప్పుడు మిగిలిన తెలంగాణా నేతలతో బాటు ఆయనని తిట్టకుండా వదిలిపెడతారా? అప్పుడు కూడా ఆయన వాదనలో తప్పేమీ లేదని చెప్పగలరా?

 

ఒకసారి కాంగ్రెస్ గూటిలోకి చేరిన చిలుకలు ఆగూటి పలుకులే పలుకుతాయి. రేపు కాకపోతే మరో రోజయినా సురేఖ ముఖ్యమంత్రిని మీడియా సాక్షిగా దుయ్యబట్టడం ప్రజలే చూస్తారు.