తెదేపాలో చేరనున్న కొణతాల

 

తెలుగుదేశం పార్టీలోంచి తన రాజకీయ శత్రువు దాడి వీరభద్రరావును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడంతో ఆగ్రహించిన వైకాపా రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ, గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ, జగన్ మోహన్ రెడ్డి, పార్టీని కష్టకాలంలో వెన్నంటి ఉన్న తనను కాదని దాడి వీరభద్రరావుకే ఎక్కువ ప్రాదాన్యం ఇవ్వడంతో ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు.

 

ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని మంత్రి గంట శ్రీనివాసరావు ప్రకటించారు. కొణతాల రామకృష్ణ మొదట కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నందున, ఆయన మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరు కొంటారని అందరూ భావించారు. కానీ, అయన త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు తాజా సమాచారం. ఇప్పటికే చంద్రబాబు నాయుడి దూతలతో ఆయన జరిపిన సంప్రదింపులు ఫలవంతమయ్యాయని ఇక నేడోరేపో ఆయన తెదేపాలో చేరడం ఖాయం అని సమాచారం.

 

అదే జరిగితే, వైకాపా ఒక బలమయిన నాయకుడిని కోల్పోతే, తేదేపాకు ఒక నమ్మకస్తుడయిన, బలమయిన నాయకుడు దొరికినట్లవుతుంది. కేవలం శాసన మండలి టికెట్ ఈయనందుకు పార్టీతో ఉన్న 30ఏళ్ల అనుబంధం పుటుక్కున తెంపుకుపోయిన దాడి వీరభద్రరావుని తీసుకొని వైకాపా ఏమి బావుకొంటుందో తెలియదు. కానీ, కొణతాల రామకృష్ణ వంటి చురుకయిన నాయకుడు దొరకడం వల్ల తెలుగుదేశం పార్టీ మాత్రం పూర్తి ప్రయోజనం పొందుతుందని చెప్పవచ్చును.

 

ఇక కర్నూల్ నుండి భూమానాగి రెడ్డి దంపతులు కూడా తెలుగుదేశం పార్టీతో పూర్తి ‘టచ్చులో’ ఉన్నట్లు తాజా సమాచారం. తమ జిల్లాలో తమ వ్యతిరేఖ వర్గానికి వైకాపా అధిష్టానం ప్రోత్సాహం ఇస్తోందని వారు పార్టీపై ఆగ్రహంతో వారు పార్టీ మరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇంకా సదరు నేతలే దృవీకరించవలసి ఉంది. ఏమయినప్పటికీ, త్వరలో వైకాపా నుండి తెదేపాలోకి కొన్ని వలసలు మాత్రం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది.