రేవంత్ చెప్పే అభ్యర్థి పేరు కూడా తెలీదు.. కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

 

హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక కాంగ్రెస్ లో చిచ్చురేపుతోంది. హుజూర్ నగర్ లో త్వరలో జరగనున్న ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి పేరును టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనను ఎంపీ రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నించారు. అంతేకాదు చామా కిరణ్ రెడ్డి పేరును తాను ప్రతిపాదిస్తున్నానని రేవంత్‌ ప్రకటించారు. అయితే రేవంత్ వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించారు. హుజూర్ నగర్ లో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలో మాకు తెలియదా? అని ప్రశ్నించారు. హుజూర్‌నగర్‌లో పద్మావతినే సరైన అభ్యర్థి అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
 
రేవంత్ చెప్పే అభ్యర్థి పేరు నాకే కాదు.. జానారెడ్డికి కూడా తెలియదని.. ఇక ప్రజలకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కొత్తగా వచ్చిన వారి సలహలు, సూచనలు అవసరం లేదని రేవంత్ ని పరోక్షంగా విమర్శించారు. 30ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం..మమ్మల్ని కాదని కొత్త అభ్యర్థిని పెడతారా? అని ప్రశ్నించారు. హూజుర్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉత్తమ్ భార్య పద్మావతి రెడ్డిపై పార్టీలో ఏకాభిప్రాయం ఉందని అన్నారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. నేను ఏకమయ్యాం. ఇన్నాళ్లు అభిప్రాయ భేదాలున్నాయి. ఇప్పుడు కలిసిపోయాం అని కోమటిరెడ్డి అన్నారు.

పీసీసీ పగ్గాలపై కూడా కోమటిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ సీనియర్లంతా నన్నే పీసీసీ చీఫ్‌ కావాలని అంటున్నారని కోమటిరెడ్డి అన్నారు. గత ముప్పై సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తున్నామని చెప్పిన ఆయన.. పాత తరం నాయకులు మొత్తం తనకు మద్దతుగా ఉన్నారని అన్నారు. దీంతోపాటు ఏఐసీసీ నాయకుల మద్దతు కూడ ఉందని కోమటిరెడ్డి అన్నారు.