TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టి కాంగ్రెస్ లో కోమటి రెడ్డి సెగ.. రోజుకో ట్వీట్ తో అధిష్టానానికి తలనొప్పి!

Published on: Tue Aug 12, 2025 11:14AM

 రేవంత్ కు పొగ పెడుతున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెగ పుట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా   రోజుకో ట్వీట్ పెడుతూ కాకరేపుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇస్తాని ఇప్పడు మోసం చేశారని రగిలిపోతున్నారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని ఆయనపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ముఖ్యమంత్రి నిర్ణయాలను తప్పుబడుతూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ పై అసంతృప్తితో ఉన్న నాయకులంతా ఆయనకు అంతర్గతంగా మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిన తరువాత తాజాగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా రాజగోపాలరెడ్డి కి మంత్రి పదవి హామీ ఇచ్చినట్లు  తెలిపారు. ఇంతకాలం మౌనంగా ఉన్న భట్టి తాజాగా రాజగోపాల్ కు అనుకూలంగా మాట్లాడటం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ లో తొలి నుంచి ఉన్న తమను కాదని రేవంత్ కు పీసీసీ పగ్గాలు అప్పగించడం,  ఆ తరువాత ఏకంగా ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం  సీనియర్లు జీర్ణించుకోలేక పోతున్నారు. దీనిని వివిధ సందర్భాల్లో  పరోక్షంగా తమ విముఖతను, వ్యతిరేకతనూ వ్యక్తం చేస్తూ వస్తున్నారు.  ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డి ఏకంగా ఒకడుగు ముందుకేసి నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. వరంగల్ జిల్లాకు చెందిన  కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ కమిటీ వెంటనే స్పందించింది. అటువంటిది నేరుగా ముఖ్యమంత్రి పై ఆరోపణలు చేసినా కనీసం క్రమశిక్షణ కమిటీ నుంచి చర్యలు లేకపోవడం చూస్తే రేవంత్ కు పొగ పెడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి కాంగ్రెస్ లో తొలి నుంచీ ఉన్నదే.. అయితే సోనియా గాంధీ ఎఐసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతికి దాదాపు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇప్పుడు తెలంగాణ విషయంలో పాత సంస్కృతిని మళ్లీ తీసుకువస్తారా అనే అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.