బీజేపీలోకి రాజగోపాల్‌రెడ్డి.. ఇదంతా కోమటిరెడ్డి బ్రదర్స్ ప్లానా!!

 

కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. "రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే!’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి శనివారం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా రాజగోపాల్‌రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుసుకునేందుకు వెళ్లిన రాజగోపాల్ రెడ్డికి.. ఆ పార్టీ పెద్దలు బంపరాఫర్ ను ఇచ్చినట్టు తెలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని, బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తామని బీజేపీ పెద్దలు చెప్పినట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ.. రాష్ట్రం నుంచి పార్లమెంట్ లో ప్రాతినిధ్యాన్ని పెంచితే, ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళ్లి, తదుపరి ఎన్నికల్లో లాభం కలుగుతుందని రాజగోపాల్‌రెడ్డికి రాజ్యసభ సభ్యుడి పదవిని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.

రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న పక్షంలో ఆయన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంట్‌రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ మొదలైంది. అయితే వెంట్‌రెడ్డి మాత్రం తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెబుతున్నారు. మీ సోదరుడు పార్టీ మారాలనుకుంటున్నారు మీ సంగతేమిటి అనే ప్రశ్నకు వెంకట్ రెడ్డి ఏది ఎమైనా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, రాబోయే రోజుల్లో అధికారం కాంగ్రెస్ పార్టీదే అన్నారు. పార్టీ మార్పుపై తుది నిర్ణయం సోదరుడిదేనని, అయినా ఒక కుటుంబంలోని వ్యక్తులు వేరు వేరు పార్టీల్లో ఉండటం సహజమేనని వెంట్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

అయితే ఇదంతా కోమటిరెడ్డి సోదరులు వారి భవిష్యత్తు కోసం వేసిన ప్లాన్ అని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ద్వితీయ స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. ఎవరైనా సరే భవిష్యత్తులో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాగలరు. అందుకే రెండు పార్టీల్లోనూ తమ కుటుంబం ఉంటే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని కొమటిరెడ్డి సోదరులే ఈ ప్లాన్ వేశారని.. ఒక్కసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరిది పైచేయి అనేది తేలగానే ఇరువురు అదే పార్టీలో ఉండిపోవాలనేది వారి ప్లాన్ అయ్యుంటుందని విశ్లేషకులు
అభిప్రాయపడుతున్నారు.