TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడుంది...తండ్రిపైనే విమర్శలా : రాజగోపాల్ రెడ్డి

Published on: Wed Apr 29, 2026 4:25PM

 

తండ్రి తిట్టి అమ్మ ఎలా అవుతావు కవితపై రాజగోపాల్ రెడ్డి ఫైర్..

అమ్మ అనిపించుకోవడం కాదు, కనీసం మర్యాద ఇవ్వండి..

కవిత కొత్త పార్టీ ఒక జోక్...డిపాజిట్ కూడా రాదు.

తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కవితపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమె తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని ఆయన అభివర్ణించారు.

చౌటుప్పల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కవితను టార్గెట్ చేశారు. కవిత పార్టీ పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశంపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సొంత తండ్రిని, తెలంగాణ ఉద్యమకారుడైన కేసీఆర్‌ను కవిత విమర్శించడం సరికాదని ఆయన హితవు పలికారు.

తండ్రి అంటే గౌరవప్రదమైన స్థానం అని, అలాంటి వ్యక్తిని దూషించే కూతురు ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తుందని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. "తండ్రికి విలువ ఇవ్వని వ్యక్తి 'అమ్మ' అనిపించుకోవడానికి ఎలా అర్హురాలు అవుతుంది?" అని ఆయన నిలదీశారు. తన సోదరుడిపై ఉన్న కోపాన్ని తండ్రిపై చూపించడం పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు.

రాజకీయ పార్టీని స్థాపించడం అనేది చాలా బాధ్యతతో కూడుకున్న పని అని, అయితే కవిత మాత్రం ఏదో పాన్ షాపు పెట్టినంత తేలికగా భావిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా కనీసం డిపాజిట్ కూడా దక్కదని రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు.

మద్యం కుంభకోణం కేసుపై కూడా ఆయన స్పందించారు. కవితకు ఇంకా క్లీన్ చిట్ రాలేదని, ఆ కేసు ఇంకా ముగియలేదని ఆయన గుర్తు చేశారు. పార్టీ పెట్టినంత మాత్రాన చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరనే సంకేతాలను ఆయన ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం తనకు అప్పగించిన బాధ్యతలను తాను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని, పదవి దక్కితే దానికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని ఆయన పునరుద్ఘాటించారు.

రాజకీయాల్లో కుటుంబ కలహాలు బయటపడటం, అది కూడా ప్రత్యర్థి పార్టీ నేతలు తీవ్రంగా విమర్శించే స్థాయికి చేరడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో కవిత తన కొత్త పార్టీ అజెండాను ఎలా ముందుకు తీసుకెళ్తారో వేచి చూడాల్సిందే.