TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజగోపాలరెడ్డి బాటలోనే కోమటి రెడ్డి వెంటకరెడ్డి.. రేవంత్ పై విమర్శలకు కారణమదేనా?

Published on: Wed Aug 3, 2022 10:56PM

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన తమ్ముడు రాజగోపాలరెడ్డి దారిలోనే నడుస్తున్నారా? లేదా నడవడానికి నిర్ణయించుకున్నారా? ఢిల్లీలో ఆయన రేవంత్ పై విమర్శల వర్షం కురిపించడం చూస్తుంటే ఔననే అనుకోవలసి వస్తోంది. కోమటి రెడ్డి సోదరులు తొలి నుంచీ రేవంత్ కు పీసీసీ పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. పీసీసీ పదవిని ఆశించి భంగపడ్డ వెంకటరెడ్డి ఆ బాధను పంటి బిగువున భరిస్తూ వస్తున్నారని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇప్పుడు కూడా కోమటి రెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడాన్ని, కమలం గూటికి చేరడాన్ని సమర్ధిస్తూనే మాట్లాడారు.

తన తమ్ముడు తనకు ఇష్టం అయిన పార్టీలోకి వెళుతున్నారు, అది ఆయన వ్యక్తిగతం అంటూ సమర్ధించారు. అయితే తన సోదరుడిపై రేవంత్ రెడ్డి విమర్శించడాన్ని మాత్రం తప్పుపడుతున్నారు. రాజగోపాలరెడ్డిని ఆనకొండ అనడానికి రేవంత్ కు ఏం హక్కు ఉందని అంటున్నారు. హస్తినలో మీడియాతో మాట్లాడిన వెంకటరెడ్డి తన ఫోకస్ మొత్తం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించడంపైనే పెట్టారు.

కాంగ్రెస్ లో లేకుండా ఉండి ఉంటే మీరు బ్రాందీ షాపుల్లో సీతా మూతలు ఏరుకోవడానికి కూడా పని కొచ్చే వారు కాదంటూ రేవంత్   తన సోదరుడితో పాటు తననూ టార్గెట్ చేసే విమర్శించారని కోమటి రెడ్డి అన్నారు. తనకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తాను ఎవరికీ ఫిర్యాదు చేయబోనని.. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని కానీ తనను రెచ్చగొడితే మాత్రం ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు.

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంతో తనకు సంబంధం లేదన్న ఆయన పనిగట్టుకుని రేవంత్ పై విమర్శలు గుప్పించడంతోనే కోమటిరెడ్డి కూడా పార్టీని వీడతారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ వీడడానికి ముందు రేవంత్‌నే టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కోమటిరెడ్డి కూడా అదే బాటలో వెడుతున్నారా అన్న సందేహాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.