TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫ్లై ఓవర్‌ ప్రమాదం మీద రాజకీయాలు మొదలు

Published on: Fri Apr 1, 2016 2:07PM

 

కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్‌ కూలి పాతికమంది చనిపోయారన్న వార్తలు ఇంకా చల్లారక ముందే, వివిధ పార్టీలు ఈ ప్రమాదాన్ని రాజకీయం చేసేందుకు సిద్ధపడిపోయాయి. త్వరలో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేతలు, ప్రమాద ఘటనను కూడా వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నిర్మాణానికి అనుమతి మీ ప్రభుత్వ హయాంలోనే ఇచ్చారంటూ తృణమూల్ విరుచుకుపడుతుంటే, కూలింది మాత్రం మీ హయాంలోనే అంటూ వామపక్షాలు మండిపడుతున్నాయి. ‘బ్రిడ్జిలోని ఏ భాగం కూలిందో గమనించాలి. మా హయాంలో నిర్మించిందా, మీ హయాంలో నిర్మించిందా!’ అంటూ మరో ప్రశ్నను లేవనెత్తారు సీపీఐ అధ్యక్షుడు బిమన్‌ బోస్‌.

 

ఈ మొత్తం ఘటనకు  రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఫిర్హద్‌ హకీంను బాధ్యునిగా నిలిపేందుకు సీపీఐ ప్రయత్నిస్తోంది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితునిగా పేరొందిన హకీం, లంచం తీసుకుని నాసిరకం నిర్మాణానికి అనుమతినిచ్చారని ఆరోపిస్తున్నారు సీపీఐ నేతలు. తక్షణమే ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు కూడా తృణమూల్ ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలని అంటున్నారు. ‘ఎవరో ఒకరి మీద నేరాన్ని తోసేస్తే సరిపోదు’ అంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నేత అధిర్‌ చౌదరి హెచ్చరిస్తున్నారు. ఇక బీజేపీ కూడా ఈ విషయంలో ఓ రాయి వేసేందుకు సిద్ధపడిపోయింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి బాబుల్ సుప్రియో మాట్లాడుతూ ఫ్లై ఓవర్ నిర్మాణం యావత్తూ అశాస్త్రీయ పద్ధతిలో జరిగిందని చెప్పుకొచ్చారు. గత ప్రమాదాల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్వలేదంటూ విమర్శించారు. ఇంతకీ ఈ ప్రమాదానికి కారణం ఎవ్వరో మాత్రం స్పష్టంగా తేలాల్సి ఉంది. అప్పటిదాకా ఇలాంటి విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి.