'కోలా' హలం వెనుక వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
Published on: Mon Jun 11, 2012 4:36PM
టిడిపి ఎంపి టిక్కెట్టు ఇస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన నుంచి రూ.5.10 కోట్లు తీసుకున్నారని యూరోలాటరీ నిందితుడు కోలా కృష్ణమోహన్ చేసిన ఆరోపణల వెనుక వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా సాక్షి దిన పత్రిక, సాక్షి టెలివిజన్ ఛానళ్ళు కోలా కృష్ణమోహన్ ఆరోపణలకు విశేష ప్రాధాన్యత నిచ్చాయి. కోలా తన ప్రకటనలో చంద్రబాబు తనను హత్య చేయించడానికి కూడా ప్రయత్నించారని ఆరోపించారు. 1998లో తొలిసారి తాను తిరుపతిలో చంద్రబాబును కలిశానన్నారు. అప్పట్లోనే తెలుగుదేశం పార్టీలో చేరానని తెలిపారు.
చంద్రబాబుకు స్విస్ బ్యాంకులో క్రెడిట్ షూస్ పేరిట అకౌంట్ ఉందన్నారు. అలానే ఆ అకౌంట్ లో 15 వేల డాలర్ల డబ్బు కూడా ఉందని తనకు తెలుసన్నారు. బాబు సూచనల మేరకు ఒకసారి ఆయన కుమారుడు నారాలోకేశ్ కు 25 లక్షల రూపాయలు అందజేశానన్నారు. మొదట కోటి పదిలక్షలు అందజేసిన తాను ఆ తరువాత నాలుగు కోట్ల రూపాయలను లండన్ మిడ్ ల్యాండ్స్ బ్యాంక్ ద్వారా బాబు సింగపూర్ డచ్ బ్యాంక్ అకౌంట్ కు మనీట్రాన్స్ ఫర్ చేశానని వివరించారు. ఇదంతా నిజమేనా అని ప్రశ్నించిన విలేకరులకు ఆ బ్యాంకు ఖాతా సి నాయుడు నారా అన్న పేరిట ఉందన్నారు. దాని నెంబర్ 22486345910 అని చెప్పారు. కోలా తనను బాబు హత్య చేయించే అవకాశాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే తాను మీడియాను కలవటానికీ ఇబ్బంది పడ్డానన్నారు.


