చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఇంతవరకు ఏ క్రికెటర్ కి సాధ్యం కాలేదు!!

 

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ప్ర‌తీ ఏడాదీ ప్రక‌టించే అవార్డుల్లో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల‌న్నింటినీ ద‌క్కించుకుని విరాట్ కోహ్లీ స‌రికొత్త చరిత్ర‌ను లిఖించాడు. ఇన్నేళ్ల చరిత్ర‌లో ఆ ఘ‌న‌త సాధించిన తొలి క్రికెట‌ర్‌గా నిలిచాడు. దుబాయ్‌లో 2018 గాను అవార్డుల జాబితాను ఐసీసీ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. ఐసీసీ ప్ర‌క‌టించే ప్ర‌తిష్టాత్మ‌క వ్య‌క్తిగ‌త అవార్డుల‌న్నింటినీ ఈ ఏడాది కోహ్లీయే ద‌క్కించుకున్నాడు. ఐసీసీ క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ (స‌ర్ గ్యార్‌ఫీల్డ్స్‌ ట్రోఫీ), ఐసీసీ వ‌న్డే ప్లేయ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌, ఐసీసీ టెస్ట్ ప్లేయ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డుల‌ను కోహ్లీ చేజిక్కించుకున్నాడు.
 
అంతేకాదు ఐసీసీ ప్ర‌క‌టించిన అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన ప్రపంచ టెస్ట్ టీమ్‌, వ‌న్డే టీమ్ కెప్టెన్‌గా కూడా కోహ్లీయే నిలిచాడు. గతేడాది అటు బ్యాట్స్‌మన్‌గా.. ఇటు కెప్టెన్ గా అద్భుత ప్రదర్శన కనబరిచిన కోహ్లీ.. ఈ రెండు జట్లకు కెప్టెన్ బాధ్యతలు సంపాదించుకోవడం విశేషం. కోహ్లీ గతేడాది 13 టెస్టుల్లో ఐదు శతకాలు నమోదు చేసి 55.08 సగటుతో మొత్తం 1,322 పరుగులు చేయగా.. 14 వన్డేల్లో ఆరు శతకాలతో మొత్తం 1,202 పరుగులు చేశాడు. దీంతో కోహ్లీ అన్ని అవార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇలా ఒకే ఏడాది మూడు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల‌ను సాధించిన క్రికెట‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ లేరు. కోహ్లీ మాత్ర‌మే తొలిసారి ఆ ఘ‌న‌త సాధించాడు.
 
‘2018లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ చూపిన అద్భుత ప్రదర్శనకు గాను ఐసీసీ టెస్టు, వన్డే జట్టులకు కెప్టెన్‌గా అతని పేరును ప్రకటించాం’ అని ఐసీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఐసీసీ ప్రకటించిన టెస్టు జట్టులో భారత్‌, న్యూజిలాండ్‌ నుంచి ముగ్గురేసి ఆటగాళ్లు చోటు సంపాదించుకున్నారు. వన్డే జట్టులో భారత్‌ నుంచి నలుగురు, ఇంగ్లాండ్‌ నుంచి నలుగురు చోటు దక్కించుకున్నారు. కోహ్లీ తర్వాత రెండు జట్లలో చోటు సంపాదించుకున్న భారత ఆటగాడు ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రానే. ఐసీసీ ప్ర‌క‌టించిన కోహ్లీ నాయ‌క‌త్వంలోని టెస్ట్ జ‌ట్టులో భార‌త్ నుంచి రిష‌భ్ పంత్‌, జ‌స్ప్రీత్ బుమ్రాల‌కు చోటు ద‌క్కింది. అలాగే కోహ్లీ నాయ‌క‌త్వంలోని వ‌న్డే జ‌ట్టులో భార‌త్ త‌ర‌ఫున‌ రోహిత్ శ‌ర్మ, కుల్దీప్ యాదవ్‌, జ‌స్ప్రీత్ బుమ్రా ఉన్నారు. కాగా, ప్ర‌తిష్టాత్మ‌క ఐసీసీ క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ ను గ‌తేడాది కూడా కోహ్లీయే ద‌క్కించుకోవ‌డం విశేషం. మాజీ ఆట‌గాళ్లు, మీడియా, బ్రాడ్‌కాస్టింగ్ స‌భ్యుల‌తో కూడిన ఓటింగ్ అకాడ‌మీ ద్వారా ఈ ఎంపిక ప్ర‌క్రియ‌ను ఐసీసీ నిర్వ‌హిస్తుంది.