TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విరాట్ కోహ్లీ మరో రికార్డు!

Published on: Sat May 23, 2026 9:52AM

క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. తాజాగా కింగ్ కోహ్లీ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు నమోదైంది.  రన్ మెషీన్ గా పరుగుల సునామీ సృష్టించే విరాట్ కోహ్లీ.. వ్యక్తిగత స్కోరుతోనే కాకుండా,  పార్టనర్ షిప్ లు నెలకొల్పడంలోనూ తనకు తానే సాటి అని ఈ రికార్డు ద్వారా నిరూపించుకున్నాడు.  ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన రసవత్తర పోరులో కోహ్లీ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. శుక్రవారం (మే 22)  జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి కోహ్లీ తొలివికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ కీలకమైన భాగస్వామ్యంతో  టీ20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు.

మొత్తం టీ20 ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీకి ఇది 211వ  50 ప్లస్ పార్టనర్ షిప్. దీంతో  ఇప్పటివరకు ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ అలెక్స్ హేల్స్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. అలెక్స్ హేల్స్ తన కెరీర్‌లో 210 సార్లు 50కి పైగా పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేసి నిన్నటి వరకూ అగ్రస్థానంలో ఉన్నాడు.  ఇప్పుడు కింగ్ కోహ్లీ 211 50 ప్లస్ పరుగుల భాగస్వామ్యాలతో అతడిని అధిగమించి  నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది దిగ్గజ టీ20 ఆటగాళ్లను వెనక్కి నెడుతూ కింగ్ కోహ్లీ ఈ ఘనత సాధించడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ప్రత్యేకమైన జాబితాను ఒకసారి గమనిస్తే, విరాట్ కోహ్లీ 211 భాగస్వామ్యాలతో మొదటి స్థానంలో నిలవగా, అలెక్స్ హేల్స్ 210 భాగస్వామ్యాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా డైనమిక్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 200 యాభై ప్లస్ భాగస్వామ్యాలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం 196 భాగస్వామ్యాలతో నాల్గో స్థానంలో, వెస్టిండీస్ యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 191 భాగస్వామ్యాలతో ఐదో స్థానంలో నిలిచారు.