కోడెల సూసైడ్... రాజకీయ నేతలకు ఇస్తోన్న సందేశమేంటి?

 

సాధారణంగా ఆత్మహత్యలు అనగానే సామాన్యులు, రైతులు, విద్యార్థులు, ఉద్యమకారులు మాత్రమే గుర్తుకొస్తుంటారు. రాజకీయ నాయకులు అస్సలు గుర్తుకురారు, ఎందుకంటే, పొలిటికల్ లీడర్స్ సూసైడ్స్ చేసుకున్న ఘటనలు అత్యంత అరుదుగా కనిపిస్తూ ఉంటాయ్. అందుక్కారణం, ఎన్నో ఒడిదొడుకులుండే రాజకీయాల్లో ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నోళ్లే ఉండగలుగుతారని అంటారు. అటు అధికారంలో... ఇటు విపక్షంలో రాటుదేలి ఉంటారు. పొలిటికల్ లీడర్స్ మనస్తత్వం మిగతా వారికి భిన్నంగా ఉంటుంది. ఎంతకైనా తెగింపుతో పోరాటం చేసేదిగా ఉంటుంది. కానీ తలదించుకునే పరిస్థితి ఏర్పడితే మాత్రం అది ప్రాణాలనే తీస్తుంది. ప్రస్తుతం కోడెల విషయంలోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. పొలిటికల్ లీడర్స్ సూసైడ్స్ కు కారణంగా ఎక్కువగా అధికారం కోల్పోవడం లేదా అవినీతి ఆరోపణలు... ఇవే ప్రధాన కారణాలు ఉన్నాయి.

రాజకీయ నాయకులపై ఆరోపణలు రావడం సర్వసాధారణం. అయితే కొందరు రాజీకొస్తే, మరికొందరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇంకొందరు ఆత్మస్థైర్యం కోల్పోతుంటారు. అయితే కోడెల కూడా ఆత్మస్థైర్యం కోల్పోయి ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. పల్నాటి పులిగా పేరు తెచ్చుకున్న కోడెల తన చివరి దశలో తీవ్రమైన ప్రజావ్యతిరేకతను చవిచూడాల్సి  వచ్చింది. ఎన్నో ఆరోపణలు వచ్చాయి. పార్టీ ఆదరాభిమానాలకు దూరం కావాల్సి వచ్చింది. అయితే, తనపై వచ్చిన ఆరోపణలతో కోడెల ఆత్మాభిమానాన్ని దెబ్బతింది. నాలుగు దశబ్దాలుగా కాపాడుకుంటూ వచ్చిన పేరు ప్రతిష్టలు ఒక్కసారిగా మసకబారడాన్ని తట్టుకోలేకపోయారు. అసెంబ్లీ ఫర్నిచర్ చోరీ ఆరోపణలు, కే ట్యాక్స్ వసూళ్ల అభియోగాలు రావడం... చివరికి తాను నమ్ముకున్న కార్యకర్తలే వ్యతిరేకించే పరిస్థితి రావడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు తాను నమ్ముకున్న పార్టీ దూరం పెట్టిందనే బాధ... అదే సమయంలో ప్రత్యర్ధి పార్టీ నుంచి వేధింపులు అధికం కావడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారని ఆయన సన్నిహితులు కొందరు చెబుతున్నారు.

ఏదిఏమైనా, కోడెల ఆత్మహత్య... ప్రస్తుత రాజకీయ నాయకులకు కనువిప్పు లాంటిది. తప్పులు చేసినా.... చేయకపోయినా....ఒక్క ఆరోపణచాలు....ఒక నాయకుడి జీవితం ముగిసిపోయేందుకు అనేది రుజువు చేస్తోంది... అందుకే ఆరోపణలు రాకుండా చూసుకోవడమే ఏకైక ఉత్తమ మార్గమైతే... ఒకవేళ రాజకీయాల్లో రాణించేందుకు చేసే చిన్నచిన్న తప్పులు... తమ జీవితాలను బలితీసుకునేవిగా మారకూడదన్న సందేశాన్ని కోడెల విషాదాంతం అందిస్తోంది.