TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గతమెంతో ఘనం, ప్రస్తుతం......కోడెల పరిస్థితి

Published on: Fri Dec 28, 2012 4:33PM

 

 

 

 

ఇటీవల ఓ సమస్య విషయంలో గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆందోళన చేస్తూ, స్థానిక డిఎస్పి చేతిలో లాఠీ దెబ్బలు తిని అరెస్టు అవడంతో తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి కోడెల శివ ప్రసాద రావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన, రాజకీయాల్లో ఎగిరిపడిన ఓ కెరటం. ఓ విలక్షణ నేత.

 

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో ఉండటమే కాకుండా, రాష్ట్రంలో ముఖ్య మంత్రి పదవి తర్వాత అత్యంత కీలకమైన హోం మంత్రి పదవిని కూడా ఓ సారి చేపట్టారు. 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కోడెల రాష్ట్ర హోం మంత్రిగా పదవి చేపట్టారు. మొత్తం ఐదు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో సంచలన నేతగా గుర్తింపు పొందారు.

 

గుంటూరు జిల్లాలో కోడెల పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అంతగా ప్రజల్లో పేరు ప్రతిష్టలు తెచ్చుకొన్నారు. తెలుగు దేశం పార్టీలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. ఒకప్పుడు సన్మానాలు, సత్కారాలతో బిజీ బిజీగా గడిపేవారు. హోం మంత్రి నియోజకవర్గంలో పనిచేస్తున్నామని పోలీస్ అధికారులు కూడా గర్వంగా చెప్పుకొనేవారు.

 

అయితే, ప్రస్తుతం అదే పోలీస్ శాఖలోని ఓ డిఎస్పి చేతిలో ఇటీవల లాఠీ దెబ్బ తిన్నారు. ఆయన హోం మంత్రి కాక ముందు ఓ ఎఎస్పి చేతిలో కూడా చెంపదెబ్బ తిన్నారు. ఇటీవల తనఫై చేయి చేసుకున్న డిఎస్పి ని సస్పెండ్ చేయాలని కోడెల డిమాండ్ చేస్తున్నారు. అయితే,ఆ అధికారిని సస్పెండ్ చేసినా, బదిలీ చేసినా ఆందోళనకు దిగుతామని ఆ అధికారి సబ్ డివిజన్ లోని సిఐ లు, ఎస్ఐ లు బహిరంగంగానే చెపుతున్నారని వార్తలు వస్తున్నాయి.

 

ఇలా పోలీస్ అధికారుల ఆగ్రహానికి గురికావడం, జైలుకు వెళ్లడంతో ఆయన ప్రతిష్టతో పాటు, పార్టీ ప్రతిష్టకు కూడా మచ్చేననే అభిప్రాయాలు వస్తున్నాయి. గతంలో హోం మంత్రిగా పని చేసిన కోడెల ప్రస్తుతం ఎంఎల్ఏ కూడా కాదు. అయితే, హోం మంత్రి దర్పాన్ని ఇంకా పోలీసుల వద్ద ప్రదర్శిస్తున్నారని ఇదే పోలీసుల ఆగ్రహానికి గురవుతూ ఉందనేది మీడియా కధనాలు చెపుతున్నాయి. కోడెల ఈ వైఖరి టిడిపి అధిష్టానానికి కూడా ఇబ్బందిగా మారిందనేది ఆ మీడియా కధనాల సారాంశం.